Rajasthan Royals: గత సీజన్‌లో పేలవ ప్రదర్శన తర్వాత రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు మేనేజ్‌మెంట్‌లో పెద్ద మార్పులు చేసింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా సీజన్ ముగిసిన తర్వాత జట్టు నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మేనేజ్‌మెంట్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్‌ను ప్రకటించింది. ఈ జట్టుతో ఇంతకుముందు కూడా చాలా కాలం పనిచేసిన దిగ్గజ ఆటగాడు కుమార్ సంగక్కరకు మేనేజ్‌మెంట్ రెండు ముఖ్యమైన పదవులను అప్పగించింది. ఐపీఎల్ 2026కు ముందు మేనేజ్‌మెంట్ మరో పెద్ద నిర్ణయం తీసుకుంది.
హెడ్ కోచ్‌గా కుమార్ సంగక్కర పునరాగమనం
రాజస్థాన్ రాయల్స్ జట్టు 2024 తర్వాత కుమార్ సంగక్కరను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. రాహుల్ ద్రవిడ్ వెళ్లిపోవడంతో ఇప్పుడు సంగక్కరను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు హెడ్ కోచ్‌గా కూడా నియమించారు. సంగక్కర జట్టుతో చేరిన తర్వాత ఫ్రాంచైజీ యజమాని మనోజ్ బదాలే మాట్లాడుతూ.. ‘ఈ స్థాయిలో జట్టుకు ఏమి అవసరమో మేము గమనించినప్పుడు అతనికున్న పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు, రాయల్స్ సంస్కృతిపై అతని లోతైన అవగాహన నిరంతరాయత, స్థిరత్వానికి సరైన సమతుల్యతను తీసుకువస్తాయని మేము భావించాము. కుమార్ పట్ల ఒక నాయకుడిగా మాకు ఎల్లప్పుడూ పూర్తి విశ్వాసం ఉంది. అతని స్పష్టత, సహనం, క్రికెట్‌కు సంబంధించిన అవగాహన జట్టును తదుపరి దశకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి’ అని అన్నారు.
పూర్తి కోచింగ్ సిబ్బంది సిద్ధం
శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 2021 నుండి 2024 వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేశారు. అతను కోచ్‌గా ఉన్నప్పుడే జట్టు 2022లో ఫైనల్స్‌కు చేరుకుంది. 2024లో కూడా రాజస్థాన్ ప్లేఆఫ్‌ల వరకు ప్రయాణించింది. సంగక్కరకు మద్దతుగా ఇప్పుడు మేనేజ్‌మెంట్ విక్రమ్ రాథోర్‌ను ప్రధాన అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. షేన్ బాండ్ బౌలింగ్ కోచ్‌గా జట్టుతో కొనసాగుతారు. ట్రెవర్ పెన్నీ కూడా అసిస్టెంట్ కోచ్ పాత్రలో కనిపిస్తారు. ఇక సిడ్ లాహిరి పర్ఫార్మెన్స్ కోచ్‌గా తిరిగి వస్తారు.
