IND vs SA 3rd ODI: ఆడుతూ పాడుతూ సీరీస్ కొట్టేశారు!

భారత్ , సౌతాఫ్రికా వన్డే సీరీస్ డిసైడర్ వన్ సైడ్ గా ముగిసింది.

  • Written By:
  • Updated On - October 11, 2022 / 08:08 PM IST

IND vs SA 3rd ODI: భారత్ , సౌతాఫ్రికా వన్డే సీరీస్ డిసైడర్ వన్ సైడ్ గా ముగిసింది. ఉత్కంఠ భరిత పోరును చూడాలనుకున్న ఫాన్స్ కు నిరాశ మిగిలింది. అయితే భారత్ జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచిన వేళ సఫారీ జట్టు చేతులెత్తేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను 27.1 ఓవర్లలో కేవలం 99 రన్స్‌కు ఆలౌట్ చేశారు.

మూడో ఓవర్లో ఓపెనర్‌ డికాక్‌ వికెట్‌ కోల్పోయిన తర్వాత సఫారీ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. భారత్ పేసర్లు, స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ చెలరేగడంతో వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. సౌతాఫ్రికా చివరి 6 వికెట్లను కేవలం 33 పరుగుల తేడాలో చేజార్చుకుంది. ఆ జట్టులో క్లాసెన్‌ 34 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్‌ 4, సుందర్‌, సిరాజ్‌, షాబాజ్‌ రెండేసి వికెట్లు తీశారు.4.1 ఓవర్లు మాత్రమే వేసిన కుల్దీప్ యాదవ్ ఓ ఓవర్ మెయిడిన్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు.

వన్డే క్రికెట్ చరిత్రలోనే దక్షిణాఫ్రికాకు ఇది నాలుగో అత్యల్ప స్కోర్. 100 పరుగుల టార్గెట్ ను భారత్ అలవోకగా చేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబ్ మన్ గిల్ తొలి వికెట్ కు 42 పరుగులు జోడించారు. ధావన్ , ఇషాన్ కిషన్ ఔటైనా …గిల్ , శ్రేయాస్ అయ్యర్ జట్టు విజయాన్ని ఖాయం చేశారు. గిల్ 49 రన్స్ కు ఔటవగా… భారత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేదించింది. టీమిండియా కీలక ఆటగాళ్ళు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోవడంతో ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా సఫారీ జట్టుపై సీరీస్ విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో గెలిచిన సౌతాఫ్రికా తర్వాత మాత్రం పెద్దగా పోటీ ఇవ్వలేక పోయింది.