Site icon HashtagU Telugu

Delhi Capitals Win: తీరు మారని కోల్ ‘కథ’…ఢిల్లీ దే విజయం

Delhi Capitals Imresizer

Delhi Capitals Imresizer

ఐపీఎల్ 15వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. బ్యాటింగ్ లో మరోసారి విఫలమైన వేళ కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. తాము వదిలేసిన స్పిన్నర్ కుల్డీప్ యాదవ్ ఆ జట్టు ను దెబ్బ తీశాడు. ఫలితంగా వరుసగా అయిదో ఓటమిని చవిచూసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. గత సీజన్ లో తనను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి ప్రతీకారం తీర్చుకున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు.
ఫించ్ , వెంకటేష్ అయ్యర్ తో సహా కోల్ కతా టాపర్డర్ ను పెవిలియన్ కు పంపారు. దీంతో
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది . ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా కలిసి కేకేఆర్‌ని ఆదుకునే ప్రయత్నం చేశారు.ఐదో వికెట్‌కి 48 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే కీలక సమయంలో వీరి జోడీ ఔటవడంతో కోల్ కతా మళ్ళీ కోలుకోలేక పోయింది. ఆఖరి ఓవర్‌లో కేవలం 2 పరగులు మాత్రమే రావడంతో కోల్ కత్తా 150 స్కోరును దాటలేకపోయింది. ముస్తాఫిజుర్ రహ్మాన్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడొట్టాడు. చేతన్ సకారియా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పృథ్వీ షా డకౌటయ్యాడు. కాసేపటికే మిచెల్ మార్ష్ కూడా ఔటవగా…డేవిడ్ వార్నర్ , లలిత్ యాదవ్ ఆదుకున్నారు.10వ ఓవర్ తర్వాత ఉమేష్ యాదవ్ రాకతో ఢిల్లీ మళ్ళీ వరుస వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో పోవల్ , అక్షర్ పటేల్ ఢిల్లీ ఇన్నింగ్స్ నిలబెట్టారు. చివర్లో అక్షర్ పటేల్ రనౌట్ అయినా.. పావెల్, శార్దూల్ ఠాకూర్ తో కలిసి ఢిల్లీ విజయాన్ని పూర్తి చేశాడు. ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగా టార్గెట్ చేదించింది. కాగా కోల్ కత్తా నైట్ రైడర్స్ కు వరుసగా ఇది అయిదో ఓటమి. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మరోవైపు నాలుగో విజయాన్ని అందుకున్న ఢిల్లీ పాయింట్ల పట్టికలో
ఆరో స్థానంలో నిలిచింది.

Pic – IPL/Twitter

Exit mobile version