IND vs SA: టీ20 మ్యాచ్ వర్షార్పణం.. టికెట్ రేటులో సగం వెనక్కి!!

బెంగళూరులో ఆదివారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ గంగపాలైంది

Published By: HashtagU Telugu Desk
Rain Cricket

Rain Cricket

బెంగళూరులో ఆదివారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ గంగపాలైంది. మ్యాచ్ మొత్తానికీ మూడున్నర ఓవర్లే పడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 3.3 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసిన సమయంలో రెండోసారి మొదలైన వర్షం.. ఇక తెరిపినివ్వలేదు. దీనితో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ప్రేక్షకులకు తీవ్ర నిరాశ మిగిలింది. టికెట్లు కొని వచ్చి.. కనీసం 3 ఓవర్ల కు మించి మ్యాచ్ చూడలేక పోయామని బాధపడ్డారు. వారికి ఊరటనిచ్చేలా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కీలక ప్రకటన చేసింది. ప్రేక్షకుల టికెట్ మొత్తంలో సగం(50 శాతం) వెనక్కి ఇస్తామని ప్రకటించింది. వాస్తవానికి నియమ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ లో ఒక్క బాల్ వేసినా టికెట్ల సొమ్మును వెనక్కి ఇవ్వరు. అయితే, అభిమానులను నిరుత్సాహానికి గురిచేయకూడదన్న ఉద్దేశంతో టికెట్ సొమ్ములో 50 శాతం వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. తమ ఒరిజినల్ టికెట్లను వెనక్కి ఇచ్చి రీఫండ్ పొందాలని మ్యాచ్‌కు హాజరైన వారికి KSCA సూచించింది.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. “ప్రేక్షకులు టికెట్లను దాచివుంచాలి. రీఫండ్ తేదీ, సమయం, ఎక్కడ చెల్లించాలనే వేదికను త్వరలోనే తెలియజేస్తం” అని పేర్కొంది.

  Last Updated: 20 Jun 2022, 11:23 AM IST