Site icon HashtagU Telugu

IPL 2024 Final: ఐపీఎల్ 2024 కోల్ కత్తాదే… ఫైనల్లో చేతులెత్తేసిన సన్ రైజర్స్

IPL 2024 Final

IPL 2024 Final

IPL 2024 Final: ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కోల్ కతా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది. లీగ్ స్టేజ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ టైటిల్ పోరులో మాత్రం చెత్తప్రదర్శనతో నిరాశపరిచింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలవడం తప్పిస్తే సన్ రైజర్స్ కు కలిసొచ్చిన అంశం ఒక్కటీ లేదు. క్వాలిఫైయర్ 2లో మొదట బ్యాటింగ్ చేసి గెలిచిన నేపథ్యంలో ప్రత్యర్థికి భారీ టార్గెట్ నిర్థేశించాలని భావించినా సక్సెస్ కాలేకపోయింది. ఆరంభం నుంచే వరుస వికెట్లు కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న ఓపెనర్లు హెడ్ , అభిషేక్ శర్మ, త్రిపాఠీ నిరాశపరిచారు. కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టడంగా బౌలింగ్ చేయడమే కాదు వరుస వికెట్లు పడగొట్టి పై చేయి సాధించారు. కేవలం 21 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయిన దశలో మక్ర్ రమ్, నితీశ్ కుమార్ ఆదుకునే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. నితీశ్ కుమార్ 13, మక్ర్ రమ్ 20 రన్స్ కే ఔటవగా… క్లాసెన్ , షాబాజ్ అహ్మద్ కూడా చేతులెత్తేశారు. చివర్లో కమ్మిన్స్ కాస్త ప్రతిఘటించడంతో సన్ రైజర్స్ స్కోర్ 100 దాటగలిగింది. చివరికి హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. కోల్ కత్తా బౌలర్లలో రస్సెల్ 3 , హర్షిత్ రాణా 2 , స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు.

114 పరుగుల టార్గెట్ ను కాపాడుకుంటుందని ఏ మూలో ఆశ ఉన్నప్పటికీ కోల్ కత్తా బ్యాటర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ నరైన్ త్వరగానే ఔటైనా…వెంకటేష్ అయ్యర్ స గుర్బాజ్ ధాటిగా ఆడారు. భారీ లక్ష్యం కాకపోయినా చక్కని షాట్లతో అలరించారు. సన్ రైజర్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో కోల్ కత్తా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. గుర్బాజ్ , వెంకటేశ్ అయ్యర్ జోరుతో కేవలం 10.3 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది. గుర్బాజ్ 39 పరుగులకు ఔటవగా… వెంకటేశ్ అయ్యర్ 52 పరుగులు చేశాడు. కోల్ కత్తా ఐపీఎల్ గెలవడం ఇది మూడోసారి. గతంలో 2012 , 2014లో ఛాంపియన్ గా నిలిచింది. విశేషమేమిటంటే గంభీర్ కెప్టెన్సీలోనే రెండుసార్లు విజేతగా గెలిచిన కోల్ కత్తా ఇప్పుడు గంభీర్ మెంటార్ గా టైటిల్ సాధించింది.

Also Read: Varun Tej: క్రిష్ నిర్మాణం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. కంచెకు మించి