ఐపీఎల్-2022లో భాగంగా ఇవాళ ముంబైలోనే వాంఖడే మైదానం వేదికగా తాడోపేడో తేల్చుకోవడానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు సిద్దమయ్యాయి. ఈ ఏడాది సీజన్‌లో వరుస విజయాలుతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ను చిత్తు చేయాలని భావిస్తోంది. ఈ సీజన్ తొలి అర్ధ భాగంలో ఈ ఇరు జట్లు ఏప్రిల్ 18న తొలిసారి ఎదురెదురుపడగా, ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సమిష్టిగా రాణించి కేకేఆర్‌పై 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎదురైన పరాభవానికి శ్రేయస్ సేన నేడు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
ఇక ఐపీఎల్ 15వ సీజన్ లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది.,ఇక మరోవైపు ఈ సీజన్ లో కేకేఆర్ 9మ్యాచ్‌ల్లో 3 విజయాలు 6 అపజయాలతో 8వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లనుండగా, ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోనుంది. ఇక ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు మొత్తం 26 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 13, రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఒక దాంట్లో ఫలితం రాలేదు.
అయితే గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ రాజస్థాన్ రాయల్స్ జట్టును తక్కువగా అంచనా వేయలేం. ఇక వరుస ఓటములతో డీలా పడ్డ కేకేఆర్.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కోల్ కత్తాకు ఈ మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి.