Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు కోర్టులో షాక్ తగిలింది. ట్యాక్స్ చెల్లింపు వ్యవహారంలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. స్టేజ్ షో వీడియోల కాపీరైట్ ద్వారా ఆమెకు భారీ డబ్బులు వస్తున్నాయని, సేల్స్ ట్యాక్స్ ఈ అమ్మడు చెల్లించాల్సిందిగా గతంలో నోటీసులు వచ్చాయి. అయితే అనుష్క శర్మ ఈ నోటీసులను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇరు వర్గాల వాదోపవాదనలు విన్న తర్వాత గురువారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అనుష్క శర్మకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. అనుష్క శర్మ పిటిషన్‌ను హైకోర్టు కొట్టిపారేసింది. ట్యాక్స్ నోటీసులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ అవకాశం ఉందని, దానిని ఉపయోగించుకోవాలని సూచించింది. మహారాష్ట్ర వ్యాల్యూ యాటెడ్ టాక్స్ చట్టం ప్రకారం నోటీసులపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, అలాంటప్పుడు తాము ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది.
నాలుగు వారాల్లోగా అనుష్క శర్మ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ ముందు అప్పీల్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది. పిటిషనర్ చెప్పిన అంశాలపై అప్పిలేట్ అథారిటీ సమగ్ర దర్యాప్తు జరిపి పరిష్కారం చూపుతుందని పేర్కొంది. అప్పీల్ చేసుకోవాలంటే ట్యాక్స్ లో 10 శాతం డబ్బులను డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది.
వివిధ కార్యక్రమాల్లో నటిస్తే ఆ వీడియోల కాపీ రైట్స్ తనవి ఎలా అవుతాయని, నిర్మాతలకే అవి వర్తిస్తాయని అనష్క చెబుతోంది. అలాంటప్పుడు నటుల శ్లాబులోనే తమకు ట్యాక్స్ వేయాలని, నిర్మాతల శ్లాబులో ఎలా వేస్తారని అనుష్క ప్రశ్నిస్తోంది. తాము నటులం అవుతామని, నిర్మాతలం కాదని చెబుతోంది. అయితే అనుష్క లేవనెత్తిన అంశానలు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఖండిస్తోంది. వీడియో కాపీరైట్స్‌కు అనుష్కనే తొలి యాజమాని అవుతుందని చెబుతోంది.