Virat Kohli: దటీజ్ కోహ్లీ… రికార్డుల రారాజు

రికార్డులు అతనికి కొత్త కాదు... రికార్డులకు అతను కొత్త కాదు.. ఈ మాట ఎవరి గురించో క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Written By:
  • Publish Date - October 24, 2022 / 03:29 PM IST

రికార్డులు అతనికి కొత్త కాదు… రికార్డులకు అతను కొత్త కాదు.. ఈ మాట ఎవరి గురించో క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ. మూడేళ్ళుగా పేలవ ఫామ్ తో సతమతమై ఆసియా కప్ తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచకప్ లో పాక్ తో మ్యాచ్ లో అదరగొట్టాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ పలు అరుదైన రికార్డులనూ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి కోహ్లి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం కోహ్లీకి ఇది 14వ సారి.

తద్వారా ఆప్ఘనిస్థాన్ ప్లేయర్ మహ్మద్ నబీని అధిగమించి అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అటు ఐసీసీ టోర్నమెంట్స్‌లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్‌ పరుగులు సాధించిన భారత ఆటగాడిగానూ కోహ్లి నిలిచాడు. ఐసీసీ మెగా ఈవెంట్‌లో కోహ్లికి ఇది 24 వ హాఫ్ సెంచరీ ప్లస్ స్కోర్. అంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజం సచిన్ పేరిట ఉండగా.. పాక్ తో మ్యాచ్ లో విరాట్ దానిని అధిగమించాడు. అలాగే టీ20 వరల్డ్‌కప్‌ల చరిత్రలో విరాట్ కోహ్లి ఇప్పటి వరకూ 927 రన్స్‌ చేశాడు. ఈ మెగా టోర్నీల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా విరాట్‌ నిలిచాడు. 851 రన్స్‌తో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే టి20 మ్యాచ్‌ల్లో లక్ష్య ఛేదనలో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన క్రికెటర్‌గానూ షోయబ్‌ మాలిక్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.