Virat Kohli: కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డ్

భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత రికార్డుల రారాజు విరాట్ కోహ్లీనే. అరంగేట్రం నుంచీ తనదైన శైలిలో పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 02:00 PM IST

భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత రికార్డుల రారాజు విరాట్ కోహ్లీనే. అరంగేట్రం నుంచీ తనదైన శైలిలో పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. సచిన్ సాధించిన చాలా రికార్డులను అధిగమించిన కోహ్లీని ఫ్యాన్స్ రన్ మెషీన్ గా పిలుస్తారు. అయితే గత మూడేళ్ళుగా కోహ్లీ పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. విరాట్ శతకం సాధించి మూడేళ్ళవుతుండగా… ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యతల ఒత్తిడి నుంచి తప్పుకున్నా కోహ్లీ ఇంకా ఫామ్ అందుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే ఇంగ్లాండ్ టూర్ వార్మప్ మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించడం సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్ట్‌లో కోహ్లీని ఓ అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. ఇప్పటి వరకూ సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ మాత్రమే ఇండియా తరఫున ఆ రికార్డును అందుకున్నారు. విరాట్‌ కోహ్లి ఈ టెస్టులో మరో 40 రన్స్‌ చేయగలిగితే వారి సరసన చేరతాడు.

ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో 2000 రన్స్‌ మైలురాయిని అందుకున్న మూడో ఇండియన్‌ క్రికెటర్‌గా కోహ్లి నిలుస్తాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై 27 టెస్టుల్లో 48 ఇన్నింగ్స్‌ లు ఆడిన విరాట్‌ ఐదు సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలతో 1960 రన్స్‌ చేశాడు. ఈ ఐదు సెంచరీల్లో మూడు శతకాలు 2018 సిరీస్‌లోనే సాధించాడు. ఇక టెస్టుల్లో కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరు 235 కూడా ఇంగ్లండ్‌పైనే ఉంది. కాగా బర్మింగ్ హామ్ టెస్టులో విరాట్‌ ఈ రికార్డు అందుకునే అవకాశముంది. సచిన్‌ మాత్రం 36 ఇన్నింగ్స్‌లో 2000 రన్స్‌ చేయగా.. గవాస్కర్‌ 47 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. చాలా కాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న కోహ్లీ బర్మింగ్ హామ్ టెస్టులో చెలరేగితే భారత్ చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు.