RCB vs SRH: ఉప్పల్ స్టేడియంలో కోహ్లీ ధనాధన్… కీలక మ్యాచ్ లో బెంగుళూరు గ్రాండ్ విక్టరీ

RCB vs SRH: ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ రేస్ ఇంకా రసవత్తరంగా మారింది. కీలక మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది.

  • Written By:
  • Publish Date - May 18, 2023 / 11:19 PM IST

RCB vs SRH: ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ రేస్ ఇంకా రసవత్తరంగా మారింది. కీలక మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. కోహ్లీ , డుప్లేసిస్ చెలరేగిన వేళ ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించింది.
ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ లోనూ ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. అభిషేక్ శర్మ , రాహుల్ త్రిపాఠీ ఇద్దరూ త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ తో కలిసి హెన్రిక్ క్లాసెన్ చెలరేగాడు. కెప్టెన్ మార్క్రమ్ తడబడుతుంటే.. క్లాసెన్ మాత్రం తన సూపర్ ఫామ్‌తో కొనసాగించాడు.

ఎడాపెడా బౌండరీలు బాదేసిన అతను కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. క్లాసెన్ 51 బంతుల్లో 104 పరుగులు చేయగా…చివర్లో హ్యారీ బ్రూక్ కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే డెత్ ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.దీంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. బ్రేస్‌వెల్ రెండు వికెట్లు… సిరాజ్ హర్షల్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్‌తో రాణించారు.

187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లీ , కెప్టెన్ డుప్లేసిస్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. మరోసారి వీరిద్దరూ తమ ఫామ్ కొనసాగిస్తూ భారీ షాట్లతో విరుచుకు పడ్డారు. సన్ రైజర్స్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయారు. దీంతో బెంగుళూరు పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా కోహ్లీ జోరు తగ్గలేదు.

పరుగుల దాహంతో ఉన్న విరాట్ స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ అభిమానులను ఉర్రూతూగించాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా…అటు డుప్లేసిస్ కూడా ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి జోరుతో మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. భువనేశ్వర్ వేసిన 15 వ ఓవర్లో కోహ్లీ నాలుగు ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో విరాట్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ కెరీర్ లో కోహ్లీకి ఇది ఆరో శతకం. తద్వారా ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో రన్ రేట్ బాగా మెరుగుపరుచుకున్న బెంగుళూరు ప్లే ఆఫ్ రేస్ లో మరింత ముందంజ వేసింది.