Site icon HashtagU Telugu

IND Vs PAk: దుమ్ము రేపిన కోహ్లీ ,కే ఎల్ రాహుల్ భారత్ భారీ స్కోరు

India vs Pakistan

India vs Pakistan

ఇది కదా బ్యాటింగ్ అంటే…ఇదే కదా చిరకాల ప్రత్యర్థిపై భారత్ అభిమానులు ఆశించే బ్యాటింగ్…మిగిలిన జట్లపై కొట్టడం వేరు…పాకిస్థాన్ పై కొట్టడం వేరు… పాక్ పై సెంచరీ కొడితే ఆ కిక్కే వేరప్పా…ఆసియా కప్ లో పాక్ తో మ్యాచ్ సందర్భంగా భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఫాన్స్ ఖచ్చితంగా ఇలాగే అనుకుని ఉంటారు. ఎందుకంటే మన బ్యాటింగ్ అలా సాగింది. వర్షాలతో బ్రేక్ పడుతూ సాగిన మన ఇన్నింగ్స్ లో కే ఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. కోహ్లీ , కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగటంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కోహ్లీ, రాహుల్ 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిజర్వ్ డే అయిన నేడు బ్యాటింగ్ మొదలుపెట్టిన వీరిద్దరూ పాక్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు.

కోహ్లి కేవలం 84 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లికిది 47వ శతకం కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 77వది. తద్వారా సమకాలీన క్రికెటర్లెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సెంచరీల రికార్డులో కోహ్లీ మరో అడుగు ముందుకేసాడు.

Kohli

మరోవైపు కే ఎల్ రాహుల్ కూడా అదరగొట్టాడు. రాహుల్‌ 106 బంతుల్లో 111 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గాయం నుంచి కోలుకుని దాదాపు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన కేఎల్‌ రాహుల్‌ వచ్చీరాగానే సెంచరీతో సత్తా చాటాడు. అర్ధసెంచరీలు పూర్తి చేసుకునేంతవరకు ఆచితూచి ఆడిన రాహుల్‌, విరాట్‌లు ఆతర్వాత గేర్‌ మార్చారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదేశారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.

Exit mobile version