Kohli Australia:ఆసీస్ తో సిరీస్ లో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే

టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు భారత జట్టు బిజీ షెడ్యూల్ తో గడపనుంది. మెగా టోర్నీకి ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో సిరీస్ లు ఆడనుంది.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 01:46 PM IST

టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు భారత జట్టు బిజీ షెడ్యూల్ తో గడపనుంది. మెగా టోర్నీకి ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో సిరీస్ లు ఆడనుంది. ప్రస్తుతం ఈ సిరీస్ కోసం భారత కీలక ఆటగాళ్లందరూ సన్నద్ధమవుతున్నారు. ఎప్పటిలానే ఈ సిరీస్ లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే అందరి చూపు ఉంది. ఇటీవలే ఆసియాకప్ తో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.

ఈ సిరీస్ లో కోహ్లీ మరో 98 రన్స్ చేస్తే టీ ట్వంటీ కెరీర్ లో 11 వేల పరుగుల మైలురాయి అందుకుంటాడు. కోహ్లీ ఇప్పటి వరకూ అన్ని టీ ట్వంటీల్లో కలిపి 10902 పరుగులు చేశాడు. దీనిలో 6 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐదు సెంచరీలు ఐపీఎల్ లో సాధించిన కోహ్లీ ఇటీవల ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ పై శతకం సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోనూ సెంచరీ అందుకున్నాడు. కోహ్లీ 11 వేల పరుగుల మైలురాయితో పాటు మరో రికార్డు ముంగిట కూడా నిలిచాడు. విరాట్ మరో 62 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో సచిన్ 3437 రన్స్ తో అగ్రస్థానంలో ఉండగా.. ద్రావిడ్ 24064 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

విరాట్ 468 మ్యాచ్ లలో 24002 రన్స్ తో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. మరో 62 రన్స్ చేస్తే ద్రావిడ్ ను అధిగమిస్తాడు. కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ లో 71 సెంచరీలు, 124 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దాదాపు మూడేళ్ళ నుంచీ ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఎట్టకేలకు ఆసియాకప్ లో అదరగొట్టాడు. పాక్ తో మ్యాచ్ లోనూ, ఆప్ఘనిస్థాన్ పైనా కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు కోహ్లీ ఫామ్ లోకి రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇదే ఫామ్ సొంతగడ్డపైనా కోహ్లీ కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు.