Site icon HashtagU Telugu

Virat Kohli: కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ ఎపిసోడ్.. క్లారిటీ ఇచ్చిన దాదా

Kohli Sledging

Kohli Sledging

Virat Kohli: భారత క్రికెట్‌లో కోహ్లీ కెప్టెన్సీ వీడినప్పుడు చాలా చర్చ జరిగింది. దూకుడైన సారథిగా పేరున్నప్పటకీ.. మేజర్ టోర్నీలో జట్టును గెలిపించలేకపోయాడు. అయితే గత ఏడాది సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ కోల్పోయినప్పుడు టెస్ట్ ఫార్మాట్‌ కెప్టెన్‌గానూ కోహ్లీ తప్పుకున్నాడు. బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్ గంగూలీతో విభేదాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై అప్పుడు వీరిద్దరిలో ఎవరూ స్పందించలేదు. తర్వాత వీరి మధ్య జరిగిన పలు పరిణామాలతో అందరూ విభేదాలు నిజమేనని భావించారు. తాజాగా దీనిపై గంగూలీ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు ఏం జరిగిందో వెల్లడించాడు. బీసీసీఐ ఎప్పుడూ కూడా కోహ్లీని సారథ్యం నుంచి తప్పుకోమని చెప్పలేదన్నాడు. నిజానికి విరాట్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు బీసీసీఐ కూడా రెడీగా లేదని దాదా చెప్పాడు. ఆ సిరీస్‌ తర్వాత కోహ్లీ ఎందుకలా చేశాడన్నది అతను మాత్రమే చెప్పగలడన్నాడు.

కోహ్లీ హఠాత్తుగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కాస్త ఇబ్బంది నెలకొన్నప్పటకీ.. రోహిత్‌నే తాము సరైన ఎంపికగా భావించామని దాదా చెప్పాడు. హిట్‌మ్యాన్ అప్పటికే వన్డే ఫార్మాట్‌లో సారథిగా కొనసాగుతున్నాడని, కోహ్లీ స్థానంలో మరో ప్రత్యామ్నాయం కూడా కనిపించలేదన్నాడు. అయితే కోహ్లీ అద్భుతమైన నాయకుడంటూ కితాబిచ్చాడు గంగూలీ. రవిశాస్త్రి,కోహ్లీ ఆధ్వర్యంలో టీమిండియా సాధించిన అద్భుత విజయాలే దీనికి నిదర్శనమన్నాడు. దాదా తాజాగా చేసిన వ్యాఖ్యలతో కోహ్లీతో విభేదాలు లేవన్నది తేలిపోయిందంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఐసీసీ టోర్నీల్లో భారత్ ప్రదర్శనపైనా దాదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ కంటే ఐపీఎల్ గెలవడమే కష్టమన్నాడు. ప్రపంచకప్‌లో నాలుగైదు మ్యాచ్‌లు గెలిస్తే సెమీస్‌ చేరతామని, అదే ఐపీఎల్ ట్రోఫీ అందుకోవాలంటే 17 మ్యాచ్ లు గెలవాలని గంగూలీ వ్యాఖ్యానించాడు. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఓడినప్పటకీ… రానున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా రాణిస్తుందని దాదా ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్‌పై పూర్తి నమ్మకముందని, సొంతగడ్డపై భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తుందన్నాడు.

Read More:Amit Shah Politics: బీజేపీ ఆకర్ష్.. రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా భేటీ!