Kohli Centuries: సెంచరీల సెంచరీ కొట్టేస్తాడా?

సమకాలిన క్రికెట్ లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ విరాట్ కోహ్లీ.. ఫార్మేట్ ఏదైనా కొన్నేళ్ళుగా పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులను అందుకున్నాడు.

  • Written By:
  • Publish Date - March 15, 2023 / 08:00 PM IST

సమకాలిన క్రికెట్ లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ విరాట్ కోహ్లీ (Kohli) ఫార్మేట్ ఏదైనా కొన్నేళ్ళుగా పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న చాలా రికార్డులను కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇప్పుడు కోహ్లీని ఊరిస్తోన్న అసలైన రికార్డు మరొకటి ఉంది. అదే సెంచరీల సెంచరీ.. మూడేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇటీవలే మళ్లీ గాడిన పడిన విరాట్ సచిన్ సెంచరీల సెంచరీ రికార్డును బ్రేక్ చేస్తాడా.. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.
ప్రపంచ క్రికెట్ లో విరాట పర్వం గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రికార్డులను తన ఇంటి చిరునామాగా మార్చేసుకున్న విరాట్ కోహ్లీకి ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారించడమే తెలుసు. అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన కొద్ది కాలంలోనే అందుకోని రికార్డు లేదు.. సాధించని ఘనత లేదు. సచిన్ తర్వాత ఆ స్థాయిలో రన్ మెషీన్ గా పేరు తెచ్చుకున్నాడు. టెస్ట్ , వన్డే, టీ ట్వంటీ ఫార్మేట్ ఏదైనా కోహ్లీ క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి జట్ల గుండెల్లో దడ మొదలైనట్టే. సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ ప్రయాణంలో అందుకున్న పలు రికార్డులను విరాట్ చాలా తక్కువ సమయంలోనే సాధించాడు. మధ్యలో ఫామ్ కోల్పోయినా కొన్ని రికార్డులు కోహ్లీ ఖాతాలో చేరాయి. అయితే తాజాగా మరో అరుదైన రికార్డు గురించి చర్చ మొదలైంది. ఆసీస్ పై నాలుగో టెస్టులో శతకం చేయడంతో కోహ్లీ అంతర్జాతీయ సెంచరీల సంఖ్య 75కు చేరింది. దీంతో సచిన్ సెంచరీల సెంచరీ రికార్డును కోహ్లీ అందుకోవడం ఖాయమని మాజీ క్రికెటర్లు ధీమాగా చెబుతున్నారు. విరాట్ అంతర్జాతీయ క్రికెట్ లో వంద కంటే ఎక్కువ సెంచరీలు చేస్తాడని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు.

కోహ్లీ (Kohli) ప్రస్తుత వయసు 34 అయినప్పటకీ ఫిట్ నెస్ పరంగా 24 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నాడని భజ్జీ ప్రశంసించాడు. అందుకే మరో ఆరు, ఏడేళ్లు ఆడినా కోహ్లీ ఈజీగా సచిన్ శతకాల రికార్డును దాటేస్తాడని చెబుతున్నాడు. నిజమే భజ్జీ చెప్పిన ఫిట్ నెస్ విషయంలో ఎవరూ డౌట్ పడరు. వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ ఫిట్ నెస్ ఉన్న ఆటగాళ్ళలో కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. టీ ట్వంటీలకు దూరమవుతాడని అనుకున్నా.. వన్డే , టెస్టుల్లో నిలకడగా రాణిస్తే కోహ్లీ వంద సెంచరీల రికార్డును అందుకునే అవకాశముంటుంది. ఈ ఏడాది చివరి వరకూ ఎక్కువ వన్డేలు ఆడనున్న నేపథ్యంలో కింగ్ కోహ్లీ ఖాతాలో మరిన్ని శతకాలు చేరతాయంటున్నారు ఫ్యాన్స్. అయితే రానున్న రెండేళ్ళు కోహ్లీ కెరీర్ కు చాలా కీలకమనే చెప్పాలి. బిజీ షెడ్యూల్ లో అన్ని మ్యాచ్ లూ ఆడడం, ఫామ్ కొనసాగించడం అంత ఈజీ కాదు. 2016 నాటి సూపర్ ఫామ్ మళ్ళీ రిపీట్ చేస్తే విరాట్ వంద శతకాల మార్క్ అందుకుంటాడు. అయితే వరల్డ్ క్రికెట్ లో మరే బ్యాటర్ కూడా కోహ్లీకి చేరువలో లేడు. అందుకే సచిన్ రికార్డును అందుకునే సత్తా , అవకాశం కోహ్లీకే ఉందంటున్నారు మాజీలు.

Also Read:  RCB Women’s Team: అదే కథ.. అదే వ్యథ