Site icon HashtagU Telugu

Virat Kohli record : దిగ్గజాలను దాటేసిన కోహ్లీ

virat kohli

virat kohli

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత జట్టు ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. మిడిలార్డర్ వైఫల్యం, రాహుల్ పేలవ కెప్టెన్సీ ఓటమికి కారణాలుగా చెబుతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం ఫ్యాన్స్ కు ఊరటనిచ్చింది. చాలా కాలంగా జట్టుకు దూరమైన ధావన్ కు ఈ సిరీస్ కీలకంగా మారింది. తన చోటు నిలుపుకోవాలంటే నిలకడగా రాణించాల్సిన సమయంలో ధావన్ 79 రన్స్ చేశాడు. అటు కోహ్లీ కూడా ఫామ్ అందుకున్నాడు. చాలా కాలంగా భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్న విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడి నిలిచాడు. తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద విరాట్ ఈ రికార్డు అందుకున్నాడు. దాంతో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. విదేశాల్లో సచిన్ వన్డేల్లో 5,065 పరుగులు చేయగా… విరాట్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

విదేశాల్లో వన్డే మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ, సచిన్ తర్వాత ధోనీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ విదేశాల్లో జరిగిన వన్డేల్లో 4,520 పరుగులు చేశాడు. ధోనీ తర్వాతి స్థానంలో రాహుల్ ద్రవిడ్ , సౌరభ్ గంగూలీ ఉన్నారు. కాగా ఓవరాల్‌గా చూసుకుంటే విదేశాల్లో 50 ఓవర్ల ఫార్మాట్‌కు సంబంధించి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 5,518 పరుగులతో కుమార సంగక్కర అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ 5,108 పరుగులతో ఉండగా.., ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 5,090 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంటే సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా కూడా కోహ్లీ నిలిచాడు. తొలి వన్డేలో 22 పరుగుల స్కోర్ దగ్గర ద్రావిడ్ ను, 26 రన్స్ దగ్గర గంగూలీని అధిగమించాడు. దక్షిణాఫ్రికాలో 29 మ్యాచ్ లు ఆడిన గంగూలీ 1313 పరుగులు చేయగా…ద్రావిడ్ 36 మ్యాచ్ లలో 1309 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీతో కోహ్లీ వీరిద్దరినీ అధిగమించాడు.

Exit mobile version