India: విరాటపర్వంతో నాలుగోరోజు మనదే

అహ్మదాూాద్ టెస్టులో నాలుగోరోజు భారత్ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది.

  • Written By:
  • Updated On - March 12, 2023 / 08:36 PM IST

India: అహ్మదాూాద్ టెస్టులో నాలుగోరోజు భారత్ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. విరాట్ కోహ్లీ శతకానికి తోడు అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ సమయోచిత ఇన్నింగ్స్ తో భారత్ కు ఆధిక్యం దక్కింది. నాలుగోరోజు ఆటలో కోహ్లీ సెంచరీనే హైలెట్ గా చెప్పాలి. సుదీర్ఘ కాలంగా టెస్టుల్లో శతకం కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు దానిని అందుకున్నాడు. రొటీన్ బ్యాటింగ్ కు భిన్నంగా చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ… జడేజా, శ్రీకర్ భరత్ , అక్షర్ పటేల్ తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జడేజా 28 రన్స్ కే వెనుదిరిగినా.. తర్వాత భరత్ , కోహ్లీకి చక్కని సపోర్ట్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఐదో వికెట్ కు 84 పరుగులు జోడించారు. భరత్ హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. కోహ్లీ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ కొనసాగించాడు. 241 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ ఇన్నింగ్స్ లో కేవలం 5 ఫోర్లే ఉన్నాయి. సెంచరీ తర్వాత కాస్త దూకుడు పెంచిన విరాట్ , అక్షర్ పటేల్ తో కలిసి స్కోర్ 500 దాటించాడు. గత కొంతకాలంగా లోయర్ ఆర్డర్ లో బ్యాట్ తో సత్తా చాటుతున్న అక్షర్ పటేల్ మరోసారి ఆకట్టుకున్నాడు. కోహ్లీతో కలిసి ఆరో వికెట్ కు 162 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా… చివరి సెషన్ లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేయగా…శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా బ్యాటింగ్ కు రాలేదు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 571 పరుగులకు ముగిసింది. దీంతో టీమిండియాకు 92 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆసీస్ బౌలర్లలో లయోన్ 3 , మర్ఫీ 3 , స్టార్క్ , కునేమన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. ఆసీస్ ఇంకా 88 పరుగులు వెనుకబడి ఉంది. అయితే మ్యాచ్ కు రేపు చివరి రోజు కావడంతో ఫలితం వచ్చే అవకాశాలు లేనట్టే. దీంతో అహ్మదాబాద్ టెస్ట్ డ్రాగా ముగియడం ఖాయమైందని చెప్పొచ్చు. తద్వారా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1తో దక్కించుకోనుంది. అయితే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలిచితీరాలి, ఇప్పుడు డ్రాగా ముగియడంతో శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురుచూడాలి. కివీస్ ఆ మ్యాచ్ లో గెలిచినా, డ్రా చేసుకున్నా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.