SA Beats India: సౌతాఫ్రికాదే రెండో టీ ట్వంటీ

వేదిక మారినా ఫలితం మారలేదు.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - June 12, 2022 / 10:39 PM IST

వేదిక మారినా ఫలితం మారలేదు.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో మిల్లర్‌ కిల్లర్‌గా మారితే.. రెండో టీ ట్వంటీలో క్లాసన్ టీమిండియాకు చుక్కలు చూపించాడు. ఫలితంగా కటక్ టీ ట్వంటీలోనూ సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు సరైన ఆరంభాన్నివ్వలేదు. రుతురాజ్ గైక్వాడ్ 1 పరుగుకే ఔటవగా.. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ధాటిగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 34 రన్స్ చేయగా.. శ్రేయాస్ 35 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. అయితే మిడిలార్డర్ వైఫల్యం భారత్ కొంపముంచింది. పంత్ 5, హార్థిక్ పాండ్యా 9 రన్స్‌కే ఔటవగా.. చివర్లో దినేశ్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్ ఫామ్ కొనసాగించిన డీకే 21 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్లతో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ ఆడకుంటే భారత్ ఇంకా తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది. సఫారీ బౌలర్లలో నోర్జే 2, రబాడ, పార్నెల్ ప్రిటోరియస్ , మహరాజ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యమే అయినప్పటకీ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో సౌతాఫ్రికా కూడా తడబడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్‌లో నిరాశపరిచిన భువనేశ్వర్ ఈ సారి చెలరేగిపోయాడు. పవర్ ప్లేలోనే హెన్రిక్స్, ప్రిటోరియస్, డస్సెన్ వికెట్లు పడగొట్టాడు. అయితే వికెట్ కీపర్ క్లాసెన్ మెరుపు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. డికాక్ లేకపోవడంతో చోటు దక్కించుకున్న క్లాసెన్ భారత బౌలర్లను ఆటాడుకున్నాడు. ఎటాకింగ్ బ్యాటింగ్‌తో సఫారీ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. క్లాసెన్ 46 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. బవూమాతో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగుల పార్టనర్‌షిప్ సాధించాడు. బవుమా 35 పరుగులు చేయగా.. చివర్లో సౌతాఫ్రికా మరో రెండు వికెట్లు చేజార్చుకున్నా అప్పటికే విజయానికి చేరువైంది. మిల్లర్ 20 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీ టీమ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో మూడో వన్డే మంగళవారం విశాఖ వేదికగా జరగనుంది.