KL Rahul: జూలై నెలాఖరులో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. జూలై 27 నుంచి ఆగస్టు 7 వరకు భారత్-శ్రీలంక మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. శ్రీలంక టూర్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతినిస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు కేఎల్ రాహుల్ (KL Rahul) వన్డే సిరీస్‌లో పునరాగమనం చేయడమే కాకుండా జట్టు బాధ్యతలను కూడా చేపట్టగలడని వార్తలు వస్తున్నాయి. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇది తొలి సిరీస్.
శ్రీలంక పర్యటనలో ఇద్దరు కెప్టెన్లు?
KL రాహుల్ T20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు పునరాగమనం చేసి శ్రీలంకతో జరిగే ODI సిరీస్‌లో కెప్టెన్ పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి T20 క్రికెట్ నుండి రిటైరయ్యారు. దీంతో శ్రీలంకతో జరగబోయే T20 సిరీస్ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడని సమాచారం. రాహుల్ సుదీర్ఘ ఫార్మాట్‌లో నిలకడగా రాణించగలడు కాబట్టి బీసీసీఐ వన్డే జట్టు కెప్టెన్‌గా రాహుల్‌పై విశ్వాసం వ్యక్తం చేస్తోందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. రాహుల్ ODI కెరీర్‌లో ఇప్పటివరకు 75 మ్యాచ్‌లలో 50.35 సగటుతో 2,820 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి.
Also Read: Bowling Coach: టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు..!
2023 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన
గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా మారడంతో భారత క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభం కానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2023 ODI ప్రపంచకప్‌లో KL రాహుల్ 450 కంటే ఎక్కువ పరుగులు చేసిన విషయం తెలిసిందే. కేఎల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 75.33 సగటుతో 452 పరుగులు చేశాడు. ఆ టోర్నీలో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపిఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌లో కెఎల్ రాహుల్- గౌతమ్ గంభీర్ కలిసి పనిచేసిన విషయం కూడా గమనించదగ్గ విషయం. రాహుల్ LSG కెప్టెన్‌గా ఉండగా గంభీర్ 2022, 2023లో లక్నో ఫ్రాంచైజీకి మెంటార్‌గా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వన్డే ఫార్మాట్‌లో రాహుల్‌ను టీమ్‌ఇండియా దీర్ఘకాలిక కెప్టెన్‌గా చూసిన ఆశ్చర్యం లేదని నివేదికలు పేర్కొన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.