Site icon HashtagU Telugu

Mumbai Indians Loses Again:ముంబైది అదే కథ.. టోర్నీ నుంచి ఔట్

Lsg

Lsg

ఐపీఎల్ 15వ సీజన్ లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి పూర్తిగా వైదొలిగింది. టోర్నీలో తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ వరుసగా 8వ మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ శతకం, తర్వాత లక్నో బౌలర్లు రాణించడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో త్వరగానే ఓపెనర్ డికాక్ వికెట్ చేజార్చుకుంది. తర్వాత మనీశ్ పాండే , కెెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ నిలిపేందుకు ప్రయత్నించారు. రెండో వికెట్ కు 58 పరుగులు జోడించారు. అయితే పాండే 22, స్టోయినిస్ డకౌటవడంతో లక్నో వికెట్ల పతనం మొదలైంది. ఒకవైపు కెఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేస్తుండగా.. మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోయింది. అయినప్పటకీ ఎక్కువసార్లు స్ట్రైకింగ్ తీసుకుంటూ స్కోర్ పెంచేందుకు రాహుల్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్ లో రాహుల్ కు ఇది రెండో శతకం. అలాగే ఓవరాల్ గా ఐపీఎల్ కెరీర్ లో నాలుగో సెంచరీ కాగా.. ముంబై ఇండియన్స్ పై మూడో సెంచరీ. రాహుల్ ఒంటరి పోరాటంతో ల‌క్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 168 ప‌రుగులు చేసింది. ముంబై బౌల‌ర్ల‌లో మెరిడిత్‌, పొలార్డ్ చెరో రెండు వికెట్లు సాధించ‌గా.. సామ్స్, బుమ్రా త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు.

ఛేజింగ్ లో ముంబైకి ఈ సారి ఓపెనర్ల నుంచి మంచి ఆరంభమే దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తొలి వికెట్ కు 49 పరుగులు జోడించారు. అయితే ఇషాన్ కిషన్ , రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ 3 ఓవర్ల వ్యవధిలో ఔటవడంతో ముంబైని దెబ్బతీసింది. తర్వాత ఫామ్ లో ఉన్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ , కిరన్ పొల్లార్డ్ గెలిపించేందుకు చివరి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. తిలక్ వర్మ 27 బంతుల్లో 38 , పోల్లర్డ్ 19 పరుగులకు ఔటయ్యారు. దీంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులే చేయగలిగింది.లక్నో బౌలర్లలో క్రునాల్ పాండ్య 3 వికెట్లు పడగొట్టాడు.
ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారంగా తప్పుకున్నట్టైంది. లీగ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా రికార్డున్న ముంబై ఇలాంటి పేలవ ప్రదర్శన చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మరోవైపు లీగ్ లో అయిదో విజయాన్ని అందుకున్న లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.