KL Rahul: ఫిట్ నెస్ టెస్ట్ పాసైతేనే…

టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మళ్ళీ రెండు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఆసియాకప్ కోసం ఎంపికైన రాహుల్ ఇప్పుడు ఫిట్ నెస్ టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్నాడు.

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 02:08 PM IST

టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మళ్ళీ రెండు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఆసియాకప్ కోసం ఎంపికైన రాహుల్ ఇప్పుడు ఫిట్ నెస్ టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఫిట్ నెస్ పరీక్ష పాస్ కాకుండా మాత్రం స్టాండ్ బై ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కనుంది. ఆసియా కప్ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్న తర్వాత ఆటగాళ్ళందరూ ముంబైలో క్యాంపుకు హాజరుకానున్నారు.

అయితే ప్రస్తుతం జట్టులో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ పైనే అందరి దృష్టీ ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్ కు సారథిగా ఎంపికై గాయంతో చివరి నిమిషంలో తప్పుకున్న రాహుల్ సర్జరీ తర్వాత ఫిట్ నెస్ సాధించినా కోవిడ్ బారిన పడ్డాడు. ప్రస్తుతం కోవిడ్ నుంచి కోలుకుని ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే రాహుల్ కు జట్టులో చోటు ఇప్పుడు అతని ఫిట్ నెస్ తోనే ముడిపడి ఉంది. ఫిట్ నెస్ టెస్ట్ పాసయితేనే ఆసియాకప్ లో రాహుల్ ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియాకప్ కు బయలుదేరే ముందు రాహుల్ కు బెంగళూరులో ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఒకవేళ రాహుల్ ఇందులో పాస్ కాకుంటే మాత్రం జట్టుతో పాటు వెళ్ళే అవకాశం లేదు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందిన రాహుల్‌ పూర్తిగా కోలుకున్నాడు.

అయితే, నిబంధనల ప్రకారం రాహుల్‌.. వచ్చే వారంలో బీసీసీఐ వైద్య బృందం ముందు ఫిట్‌నెస్‌ టెస్టు ఎదుర్కోవాల్సి ఉంది. ఫిట్ గా ఉన్నందుకే అతడిని జట్టుకు ఎంపిక చేసినా.. ప్రొటోకాల్‌ ప్రకారం బెంగళూరులో అతడికి ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహిస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. రాహుల్‌ గనుక ఈ టెస్టులో విఫలమైతే స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ కు అవకాశం లభించనుంది. ముందు జాగ్రత్తగా కొందరు స్టాండ్ బై ప్లేయర్స్ ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వారిలో శ్రేయాస్ అయ్యర్ బ్యాకప్ బ్యాటర్ గా ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌ 2022 కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌.. ఆ తర్వాత గాయం కారణంగా ఇంతవరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. ఐపీఎల్ అద్భుతంగా రాణించిన రాహుల్ 15 ఇన్నింగ్స్‌ ఆడి 616 పరుగులు చేశాడు. ఆగష్టు 27 నుంచి ఆసియా కప్‌ టోర్నీ ఆరంభం కానుండగా.. భారత్ తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. కాగా ఆసియాకప్ తో కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్ నెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రపంచకప్ కు ముందు రాహుల్ తో పాటు కోహ్లీ కూడా ఫామ్ నిరూపించుకోకుంటే భారత్ అవకాశాలపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు.