PBKS vs LSG: ఇద్దరు దోస్త్ ల.. మస్త్ మ్యాచ్ నేడే: కె.ఎల్.రాహుల్ vs మయాంక్

ఐపీఎల్ లో నేడు సాయంత్రం కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కీలకమైంది మాత్రమే కాదు..

  • Written By:
  • Publish Date - April 29, 2022 / 01:32 PM IST

ఐపీఎల్ లో నేడు సాయంత్రం కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కీలకమైంది మాత్రమే కాదు.. ఆసక్తికరమైంది కూడా!! ఎందుకంటే.. ఇందులో చిరకాల మిత్రులు కె.ఎల్.రాహుల్, మయాంక్ అగర్వాల్ వేర్వేరు జట్లలో పరస్పరం తలపడ నున్నారు. గతంలో వీరిద్దరు కలిసి భారత టెస్టు జట్టులో ఓపెనర్లు గా బ్యాట్ ఝుళిపించారు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ టీమ్ లో నాలుగేళ్లు కలిసి ఆడారు. అప్పటివరకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న కె.ఎల్.రాహుల్ అకస్మాత్తుగా టీమ్ మారిపోయాడు. లక్నో సూపర్ జయింట్స్ కు కెప్టెన్ గా చేరాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టు కెప్టెన్ గా కె.ఎల్.రాహుల్ ఆప్త మిత్రుడు మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. ఈ మ్యాచ్ వైపు ఐపీఎల్ అభిమానుల చూపు ఉండటానికి ఇదే ప్రధాన కారణం. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో పంజాబ్ కంటే లక్నో టీమ్ ముందు వరుసలో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో లక్నో 10 పాయింట్లు సాధించగా, పంజాబ్ 8 పాయింట్లనే కూడగట్టింది.

లక్నో లో రాహుల్ సూపర్ ..

కె.ఎల్.రాహుల్ లక్నో టీమ్ కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. రూ.16 కోట్ల భారీ ధరకు అతడిని లక్నో టీమ్ దక్కించుకుంది. గత 8 మ్యాచ్ లలో అతడు 2 సెంచరీలు కొట్టాడు. మొత్తం 368 రన్స్ చేశాడు. లక్నో టీమ్ కు మెంటర్ గా గౌతమ్ గంభీర్ ఉండటం, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ప్రోత్సాహంతో కె.ఎల్.రాహుల్ సత్తా చాటుతున్నాడు. సమర్ధమైన కెప్టెన్సీ తో జట్టును మెరుగైన స్థితిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా లక్నో టీమ్ లోని ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తి గా నిలుస్తున్నాడు.

పేలవంగా మయాంక్ ..

ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయినప్పటి నుంచి మయాంక్ అగర్వాల్ ఆటతీరు పేలవంగా ఉంది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో కేవలం 400 పైచిలుకు రన్స్ మాత్రమే చేశాడు. ప్రత్యేకించి ఈ ఐపీఎల్ లో గత 7 మ్యాచ్ లలో 136 పరుగులే చేయగలిగాడు. వాస్తవానికి పంజాబ్ జట్టు కు కెప్టెన్ కాకముందు వరకు మయాంక్ అద్భుతమైన ఆటతీరు కనబరిచే వాడు. కెప్టెన్సీ భారం వల్లే ఇప్పుడు బ్యాటింగ్ లో విఫలం అవుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఈరోజు చిరకాల మిత్రుడు కె.ఎల్.రాహుల్ కు చెందిన లక్నో టీమ్ పై మయాంక్ బ్యాటింగ్ తో సత్తా చాటాలి. లేదంటే.. ఈ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుంది. ప్లే గ్రౌండ్ లో కె.ఎల్.రాహుల్ , మయాంక్ ఎలా ఢీకొంటారో వేచిచూద్దాం.