T20 Asia Cup: ఆసియాకప్‌ టీమ్‌లో చోటు దక్కేదెవరికి ?

ఆసియా కప్‌ కోసం భారత జట్టును సోమవారం ప్రకటించనున్నారు. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు ఇదే మేజర్ టోర్నీ కావడంతో జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది.

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 04:39 PM IST

ఆసియా కప్‌ కోసం భారత జట్టును సోమవారం ప్రకటించనున్నారు. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు ఇదే మేజర్ టోర్నీ కావడంతో జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. సీనియర్ క్రికెటర్లందరూ సెలక్షన్‌కు అందుబాటులో ఉండడంతో యువక్రికెటర్లలో ఎవరికి చోటు దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది. ఆసియాకప్‌కు ముందు అందరిలోనూ ఆసక్తి రేపుతోన్న ప్లేయర్ విరాట్ కోహ్లీ.. చాలా కాలంగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ ఇటీవల విండీస్‌తో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే కోహ్లీ ఆసియాకప్‌తో రీ ఎంట్రీ ఇస్తాడన్న చర్చ నేపథ్యంలో ఫామ్ అందుకునేందుకు ఈ టోర్నీ మంచి అవకాశంగా భావిస్తున్నారు. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ సమీపిస్తుండడంతో ఇక సీనియర్ల అందరూ వరుస సిరీస్‌లు ఆడాలని ఇప్పటికే సెలక్టర్లు స్పష్టం చేశారు.

దీంతో విశ్రాంతి తీసుకునే అవకాశం ఎవరికీ రాకపోవచ్చు. ఆసియా కప్‌కు ఎంపికైన జట్టే దాదాపుగా ప్రపంచకప్‌లోనూ ఆడుతుందని అంచనా వేస్తున్నారు. జట్టు ఎంపిక విషయానికొస్తే గాయాల నుంచి కోలుకున్న దీపక్ చాహర్, కెఎల్ రాహుల్ రీ ఎంట్రీ ఖాయమైనట్టే. ఐపీఎల్ ముగిసిన తర్వాత సఫారీలతో సిరీస్‌కు గాయపడిన రాహుల్ జర్మనీలో సర్జరీ తర్వాత రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. విండీస్‌ టూర్‌కు ఎంపికైనప్పటికీ కరోనా బారిన పడడంతో కరేబియన్ దీవులకు వెళ్ళలేదు. ప్రస్తుతం కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌తో ఉన్నాడని బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా రాహుల్‌ లేకపోవడంతో రోహిత్‌కు తోడుగా ఓపెనింగ్ కాంబినేషన్‌కు సంబంధించి భారత్ పలు ప్రయోగాలు చేసింది. పంత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లను ఓపెనర్లుగా ఆడించగా.. ఇషాన్ కిషన్ తప్ప మిగిలిన ప్రయోగాలు విఫలమయ్యాయి.

దీంతో రాహుల్ ఆసియాకప్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. మరోవైపు దీపక్ చాహర్‌కు జింబాబ్వే సిరీస్ కీలకం కానుంది. చాహర్‌ను ఆల్‌రౌండర్ కోటాలో తీసుకునే అవకాశముంది. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో చాహర్‌ను ఆడించే ముందు ఆసియాకప్‌తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లలో అవకాశమివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం. మిగిలిన జట్టులోనూ సీనియర్లు, యువ ఆటగాళ్ల మధ్య గట్టిపోటీనే కనిపిస్తున్నప్పటకీ… వరల్డ్ కప్ దృష్ట్యా సెలక్టర్లు ఇకపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇక వరల్డ్‌కప్‌లో కీలకం కానున్న ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ప్రమోషన్ ప్రకటించే అవకాశముండగా… వికెట్ కీపర్‌గా పంత్‌తో పాటు దినేశ్ కార్తీక్‌నూ ఎంపిక చేసే అవకాశముంది. చీఫ్ సెలక్టర్ చేతన్‌శర్మ సారథ్యంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుండగా.. కెప్టెన్ రోహిత్‌శర్మ, కోచ్ ద్రావిడ్ జూమ్ ద్వారా ఫ్లోరిడా నుంచి పాల్గొనబోతున్నారు. ఆసియా కప్ యుఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి మొదలు కానుంది.

ఆసియాకప్‌కు భారత జట్టు అంచనా ః
రోహిత్‌శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్,రవీంద్ర జడేజా,రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బూమ్రా,
భువనేశ్వర్ కుమార్

బ్యాకప్ బ్యాటర్ ః దీపక్ హుడా /ఇషాన్ కిషన్ /సంజూ శాంసన్

బ్యాకప్ పేసర్లు ః అర్షదీప్‌సింగ్ /అవేశ్‌ఖాన్ /దీపక్ చాహర్‌ /హర్షల్‌పటేల్

బ్యాకప్ స్పిన్నర్లు ః అక్షర్ పటేల్ /కుల్‌దీప్‌యాదవ్ / రవి బిష్ణోయ్