Site icon HashtagU Telugu

KKR vs SRH: గెలుపు ముంగిట సన్ రైజర్స్ బోల్తా.. ఆఖరి ఓవర్లో హర్షిత్ రాణా అద్భుతం

KKR vs SRH

Safeimagekit Resized Img 11zon

KKR vs SRH: ఐపీఎల్ 17వ సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ (KKR vs SRH) ఓటమితో ఆరంభించింది. గెలవాల్సిన మ్యాచ్ లో పరాజయం పాలైంది. చివరి ఓవర్లో కోల్ కతా బౌలర్ హర్షిత్ రాణా అద్భుతమే చేశాడు. 5 బంతుల్లో 7 పరుగులను కాపాడుకుని కోల్ కత్తాను గెలిపించాడు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పడి లేచిందని చెప్పొచ్చు. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ధాటిగా ఆడే క్రమంలో వరుస వికెట్లు కోల్పోయింది. 70 పరుగుల లోపే 5 వికెట్లు చేజార్చుకుంది. కనీసం 150 స్కోరైనా చేస్తుందనుకున్న దశలో రమణ్ దీప్ సింగ్ అదరగొట్టాడు. కేవలం 17 బంతుల్లో 35 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఔట్ చేసిన తర్వాత క్రీజులోకి వచ్చిన రస్సెల్ , రింకూ సింగ్ తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల సునామీనే సృష్టించాడు.

సన్ రైజర్స్ బౌలర్లను భయపెడుతూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. తనకు మాత్రమే సాధ్యమైన పవర్ హిట్టింగ్ తో ఫ్యాన్స్ కు వీకెండ్ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. రస్సెల్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా దూకుడుగా ఆడి స్కోరును 200 దాటించాడు. చివరికి కోల్ కతా నైట్ రైడర్స్ 208 పరుగులు చేసింది. రస్సెల్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 64 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read: Andre Russell: ర‌ఫ్ఫాడించిన రస్సెల్.. కోల్ కతా నైట్ రైడర్స్ భారీస్కోర్..!

ఫ్లాట్ వికెట్ పై భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్. అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 5.3 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. అయితే ధాటిగా ఆడే క్రమంలో వరుస వికెట్లు చేజార్చుకుంది. మయాంక్ 32 , అభిషేక్ 32 , రాహుల్ త్రిపాఠీ 20 పరుగులు చేశారు. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయిన దశలో సన్ రైజర్స్ గెలవడం కష్టమనిపించింది. ఈ దశలో వికెట్ కీపర్ క్లాసెన్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

భారీ సిక్సర్లతో కోల్ కతాను కంగారు పెట్టాడు. కేవలం 29 బంతుల్లోనే 8 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. విజయం కోసం చివరి ఓవర్లో 13 రన్స్ చేయాల్సి ఉండగా.. తొలి బంతినే సిక్సర్ గా మలిచాడు. తర్వాత సింగిల్ తీయగా.. మూడో బంతికి షాబాజ్ అహ్మద్ రనౌట్ అవడం కొంపముంచింది. మూడు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో క్లాసెన్ ఔటవడంతో సన్ రైజర్స్ గెలుపుకు చేరువలో చతికిలపడింది. చివరి ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు.

We’re now on WhatsApp : Click to Join