IPL2022: శ్రేయాస్ కెప్టెన్సీపై పఠాన్ ప్రశంసలు

  • Written By:
  • Publish Date - April 5, 2022 / 10:52 AM IST

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గత రెండు మ్యాచుల్లో శ్రేయాస్ అయ్యర్ జట్టులోని వనరులను చక్కగా వినియోగించుకున్నాడని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌-2022లో భాగంగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇక కేకేఆర్‌ తమ తదుపరి మ్యాచ్ లో ఏప్రిల్‌-6న ముంబై ఇండియన్స్‌తో పోటీపడనుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గురించి ఇర్ఫాన్‌ పఠాన్‌మాట్లాడుతూ.. ఐపీఎల్ 2022 సీజన్ లో శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ తుదిజట్టును సమర్థవంతంగా ఎంపిక చేస్తున్నాడు. అలాగే సీనియర్ ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతూ వాళ్ళకి వరుసగా అవకాశాలు కల్పిస్తున్నాడు.

మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన విధానం నిజంగా అద్భుతం.. ఐపీఎల్ 2018 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కి సారథిగా ఉన్నప్పుడు శ్రేయాస్ అయ్యర్ కు అంత అనుభవం లేదు. అయితే ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఆత్మవిశ్వాసంతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. శ్రేయాస్ అయ్యర్‌ సారథ్యంలోని కేకేఆర్‌ జట్టుప్రస్తుతం అత్యంత బలంగా కనిపిస్తోంది. 2012, 2014 సీజన్లలో కేకేఆర్ కు గౌతమ్ గంభీర్ ట్రోఫీ అందివ్వగా.. ఈసారి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ జట్టు టైటిల్‌ విజేతగా నిలువనుంది అని ఇర్ఫాన్‌ పఠాన్‌ చెప్పుకొచ్చాడు… ఇక ఐపీఎల్ 2022 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ కోసం రూ.12.25 కోట్లని ఖర్చు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. సీజన్ ఆరంభానికి ముందే అతడ్ని కెప్టెన్‌గా నియమిస్తూ ప్రకటన చేసింది. ఇక ఢిల్లీ జట్టు నుంచి వచ్చిన గౌతమ్ గంభీర్.. కేకేఆర్ కి రెండు టైటిల్స్ అందించాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా ఢిల్లీ నుంచే వచ్చాడు.. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ శ్రేయాస్ రూపంలో పునరావృతం అవుతుందని కేకేఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.