Gambhir Winning Way: ఇది గంభీర్ రాసిన కోల్ ”కథ”

ఓటమిని ఒప్పుకోని తత్వం.. రాజీపడని మనస్తత్వం గంభీర్ గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. భారత క్రికెట్ కు ఆడుతున్నప్పుడు పలు సందర్భాల్లో గంభీర్ దూకుడు గురించి అందరికీ తెలుసు.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి అసలైన క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ మరిచిపోరు. అలాంటి గంభీర్ కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మెంటార్ గా రావడం అనూహ్యమే.

Gambhir Winning Way: పదేళ్ళు…కోల్ కత్తా నైట్ రైడర్స్ మూడోసారి ఛాంపియన్ గా నిలిచేందుకు పట్టిన సమయం…ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా దశాబ్ద కాలంగా ఆ జట్టుకు టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. కెప్టెన్లు మారినా… వేలంలో ప్లేయర్స్ ను మార్చినా ఫలితం మాత్రం దక్కకుండానే పోయింది. అయితే ఈ సారి మాత్రం వేలం నుంచి టోర్నీలో టైటిల్ గెలిచే వరకూ వ్యూహాత్మకంగా అడుగులు వేసి విజేతగా నిలిచింది. ఈ సక్సెస్ వెనుక ఆటగాళ్లు, కెప్టెన్ పాత్ర ఎంత ఉందో మరో వ్యక్తి పాత్ర కూడా అంతే ఉంది. అతనే కోల్ కత్తా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్… నిజమే గంభీర్ సారథ్యంలోనే కోల్ కత్తా గతంలో రెండుసార్లు విజేతగా నిలిచింది. ఇప్పుడు అతని మార్గనిర్దేశకత్వంలోనే మరోసారి ఛాంపియన్ అయింది.

ఓటమిని ఒప్పుకోని తత్వం.. రాజీపడని మనస్తత్వం గంభీర్ గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. భారత క్రికెట్ కు ఆడుతున్నప్పుడు పలు సందర్భాల్లో గంభీర్ దూకుడు గురించి అందరికీ తెలుసు.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి అసలైన క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ మరిచిపోరు. అలాంటి గంభీర్ కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మెంటార్ గా రావడం అనూహ్యమే. ఎందుకంటే గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు కోచ్ గా వ్యవహరించాడు. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో వాగ్వాదానికి దిగి లక్నో ఫ్యాన్స్ నుంచే ట్రోలింగ్ ఎదుర్కోవడం, ఆ తర్వాత లక్నోకు గుడ్ బై చెప్పడం జరిగిపోయాయి. అదే సమయంలో గంభీర్ కెప్టెన్సీ సత్తాను చూసిన కోల్ కత్తా ఓనర్ షారూఖ్ ఖాన్ మెంటార్ గా వ్యవహరించాలని కోరడం , గౌతీ అంగీకరించడం జరిగిపోయాయి. చంద్రకాంత్‌ కోచ్‌ ఉన్నప్పటకీ జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. పెద్దగా ఫామ్‌లో లేని సునీల్‌ నరైన్‌ను ఓపెనర్‌గా తెచ్చి సక్సెస్‌ చేయించడం.. వెంకటేశ్‌ అయ్యర్, హర్షిత్‌ రాణాలను సరిగ్గా ఉపయోగించుకోవడం వంటివి గంభీర్ ప్రణాళికలే. ఎక్కువ అవకాశాలు దక్కించుకోలేకపోయిన ఫిల్‌ సాల్ట్‌ లాంటి హిట్టర్‌ని ఓపెనర్‌గా దింపి విజయవంతం అయ్యేలా చేశాడు. వైభవ్‌ అరోరా లాంటి కుర్రాడిని కొత్త బంతితో బౌలింగ్‌ చేయడం కూడా గౌతి వ్యూహమే.

Also Read: IPL 2024 Final: ఐపీఎల్ 2024 కోల్ కత్తాదే… ఫైనల్లో చేతులెత్తేసిన సన్ రైజర్స్

అన్నింటికీ మించి గంభీర్ సక్సెస్ వెనుక ఫ్రాంచైజీ ఓనర్ షారూఖ్ ప్రోత్సాహం ఎంతో ఉంది. కోచ్ కంటే ఎక్కువ స్వేచ్ఛను గంభీర్ కు ఇవ్వడం ద్వారా ఫలితాన్ని రాబట్టాడు. ఒకదశలో కోచ్ చంద్రకాంత్ పండిట్ ను డమ్మీగా చేశారంటూ విమర్శలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా జట్టును సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడంలో గంభీర్ దే కీలకపాత్ర. రెండు టైటిల్స్ గెలిచిన తర్వాత వరుస సీజన్లలో పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తూ వస్తున్న జట్టును తన మార్గనిర్దేశకత్వంలో మళ్లీ గాడిన పెట్టడమే కాదు అందరి ఆటగాళ్ళను పరిస్థితులకు తగ్గట్టు వాడుకుని ఛాంపియన్ గా నిలిపాడు. అందుకే ఇది గంభీర్ రాసిన కోల్ కథ అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

                                                                                                                  సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు

                                                                                                                                          నరేష్