Site icon HashtagU Telugu

Shreyas: శ్రేయాస్ అయ్యర్‌కు జాక్‌పాట్‌

Shreyas

Shreyas

ఐపీఎల్ మెగా వేలంలో ఊహించినట్టుగానే శ్రేయాస్ అయ్యర్ జాక్‌పాట్ కొట్టాడు. బేస్ ప్రైస్ 2 కోట్లతో వేలంలో నిలిచిన అయ్యర్ కోసం దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఈ స్టార్ క్రికెటర్‌ను తీసుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నించడంతో బిడ్డింగ్‌లో ధర పెరుగుతూ పోయింది. చివరికి రూ12.25 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ శ్రేయాస్ అయ్యర్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా ఏడు ఐపీఎల్‌ సీజన్లలో అయ్యర్‌ 87 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 2375 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయవంతంగా నడిపించిన శ్రేయాస్‌ అయ్యర్.. 2020 ఐపీఎల్‌లో జట్టును ఫైనల్‌ చేర్చాడు.

అయితే ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక అయ్యర్‌ గాయంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో అతని స్థానంలో ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ రిషబ్‌ పంత్‌కు నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. అయ్యర్ తిరిగి వచ్చినా ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం మాత్రం రిషబ్‌ పంత్‌నే సారథిగా కొనసాగించింది. దీంతో వేలంలోకి వెళ్ళాలని శ్రేయాస్ నిర్ణయించుకున్నాడు. ఢిల్లీ కూడా రిటైన్ చేసుకోకపోవడంతో ఫ్రాంచైజీతో మనస్పర్థలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. మొత్తం మీద వేలంలో అయ్యర్‌కు మంచి డిమాండ్ ఉంటుందన్న అంచనాలు నిజం చేస్తూ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అయ్యర్‌ను సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశముందని సమాచారం.