WI vs IND: చివరి పంచ్ విండీస్ దే… సిరీస్ డిసైడర్ లో భారత్ ఓటమి

వరుసగా రెండు టీ ట్వంటీలు గెలిచి సిరీస్ ను సమం చేసిన టీమిండియా చివరి మ్యాచ్ లో మాత్రం బోల్తా పడింది. బౌలర్లు తేలిపోయిన వేళ చివరి టీ ట్వంటీలో పరాజయం పాలై సిరీస్ చేజార్చుకుంది.

WI vs IND: వరుసగా రెండు టీ ట్వంటీలు గెలిచి సిరీస్ ను సమం చేసిన టీమిండియా చివరి మ్యాచ్ లో మాత్రం బోల్తా పడింది. బౌలర్లు తేలిపోయిన వేళ చివరి టీ ట్వంటీలో పరాజయం పాలై సిరీస్ చేజార్చుకుంది. బౌలింగ్ లో భారత్ ను కట్టడి చేసిన కరేబియన్ టీమ్ అటు బ్యాటింగ్ లోనూ అదరగొట్టి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఈ సారి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. యశస్వి జైశ్వాల్ తొలి ఓవర్ ఐదో బంతికే ఔటవగా.. శుభ్ మన్ గిల్ కూడా నిరాశపరిచాడు. 9 పరుగులకే గిల్ వెనుదిరిగాడు. ఈ దశలో మరోసారి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జట్టును ఆదుకున్నారు.వీరిద్దరూ మూడో వికెట్ కు 49 పరుగులు జోడించారు. మరోసారి ఆకట్టుకున్న తిలక్ వర్మ ధాటిగా ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 రన్స్ చేసాడు. తిలక్ వర్మ ఔటైన తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్థిక్ పాండ్యా 13, సంజూ శాంసన్ 14 , అక్షర్ పటేల్ 13 రన్స్ కే ఔటయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడడంతో స్కోర్ కూడా పెరిగింది. ఈ క్రమంలో సూర్యకుమార్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్యకుమార్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. చివర్లో భారత్ ను విండీస్ బౌలర్లు కట్టడి చేసారు. ఫలితంగా టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో షెపర్డ్ 4 , హోల్డర్ 2 , హొస్సేన్ 2 వికెట్లు పడగొట్టారు.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 12 రన్స్ కే తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ఓపెనర్ కైల్ మేయర్స్ ను అర్ష దీప్ సింగ్ పెవిలియన్ కు పంపాడు. అయితే మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ , నికోలస్ పూరన్ ధాటిగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 107 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే 117 పరుగుల స్కోరు దగ్గర వర్షం అడ్డు పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మ్యాచ్ తిరిగి ఆరంభమయిన తర్వాత మరో వికెట్ పడినా అప్పటికే విండీస్ విజయం ఖాయమైంది. బ్రాండన్ కింగ్ 55 బంతుల్లో 5 ఫోర్లు , 6 సిక్సర్లతో 85 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కింగ్ జోరుతో విండీస్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ అందుకుంది.ఈ విజయంతో మ్యాచ్ తో పాటు టీ ట్వంటీ సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది.

Also Read: Dhanush : ధనుష్‌ నటుడు కాకముందు ఏమవ్వాలి అనుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..