Khaleel Ahmed: భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. మరికొందరు భారతీయ ఆటగాళ్లు కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) అకస్మాత్తుగా ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్నాడనే వార్త చర్చనీయాంశంగా మారింది. కేవలం 2 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడి, అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసినప్పటికీ అతను మధ్యలోనే జట్టును వీడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, దీని వెనుక ఉన్న కారణాన్ని అతని కౌంటీ జట్టు ఎసెక్స్ వెల్లడించింది.
ఖలీల్ అహ్మద్ ఎసెక్స్‌ను వీడటానికి కారణం
ఎసెక్స్ క్రికెట్ జట్టుతో ఖలీల్ అహ్మద్ 6 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 10 లిస్ట్ ఎ మ్యాచ్‌ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంలో భాగంగా అతను కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వాటిలో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో ఖలీల్ వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ మధ్యలోనే జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై ఎసెక్స్ జట్టు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “ఎసెక్స్ క్రికెట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. ఖలీల్ అహ్మద్ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించాడు. క్లబ్‌తో అతని పనితీరు ముగిసింది” అని తెలిపింది.
ఎసెక్స్ జట్టు నిరాశ, మద్దతు
ఖలీల్ అహ్మద్ మధ్యలోనే జట్టును వీడటంపై ఎసెక్స్ జట్టు నిరాశ వ్యక్తం చేసినప్పటికీ, అతని నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించింది. “అతను వెళ్లిపోవడం మాకు బాధ కలిగించినప్పటికీ మేము ఖలీల్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తాము. మాతో ఉన్న సమయంలో అతని సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఎసెక్స్ క్రికెట్‌లోని అందరూ ఖలీల్‌కు భవిష్యత్తులో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు” అని జట్టు పేర్కొంది.
ఎసెక్స్ తరఫున ఆడే ముందు ఖలీల్ ఇండియా A జట్టు కోసం ఒక మ్యాచ్ ఆడి 4 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా అతనికి టెస్ట్ జట్టులో అవకాశం దక్కలేదు. అందుకే అతను కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడాలనే కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఖలీల్ స్వదేశానికి తిరిగి రావడానికి గల వ్యక్తిగత కారణాలు ఏమిటనే దానిపై మాత్రం స్పష్టత లేదు.