World Record : విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రాజస్థాన్ రాయల్స్ యువ బౌలర్ విఘ్నేశ్ పుతుర్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. కేరళ తరఫున బరిలోకి దిగిన విఘ్నేశ్.. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు అందుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. దీంతో 32 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. విఘ్నేశ్ పుతుర్ తన అద్భుత ప్రదర్శనతో కేరళ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
- వరల్డ్ రికార్డ్ సృష్టించిన విఘ్నేశ్ పుతుర్
- ఒకే మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు పట్టి ఘనత
- 32 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన ప్లేయర్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఎన్నడూ లేనంతగా వార్తల్లో నిలుస్తోంది. సీనియర్ స్టార్లతో కళ సంతరించుకున్న ఈ టోర్నమెంట్‌లో వరుసగా రికార్డులు నమోదవుతున్నాయి. టోర్నీ ప్రారంభమైన రోజునే అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన రికార్డును మూడు సార్లు తిరగరాశారు ప్లేయర్లు. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌తో పాటు యంగ్ ప్లేయర్లు వైభవ్ సూర్యవంశీ, షాకిబుల్ గని వంటి వారు పరుగులు వరద పారించారు. ఇప్పటి వరకు రికార్డులు సృష్టించిన వారంతా దాదాపు బ్యాటర్లే. అయితే ఈ ట్రోఫీలో రాజస్థాన్ రాయల్స్ యంగ్ బౌలర్ విఘ్నేష్ పుతుర్ కూడా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
వరల్డ్ రికార్డ్..
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం (డిసెంబర్ 24) త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కేళర తరఫున బరిలోకి దిగాడు విఘ్నేశ్ పుతుర్. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు విఘ్నేశ్. మొదటగా ఉదియన్ బోస్‌తో ప్రారంభించి.. స్రిదమ్ పాల్, స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభజిత్ సర్కార్, వికి.. క్యాచ్‌లు అందుకున్నాడు. మొత్తం ఆరు క్యాచ్‌లు అందుకొని వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. దీంతో 32 ఏళ్ల రికార్డును బద్ధలుకొట్టాడు విఘ్నేశ్ పుతుర్.
ఇప్పటివరకు లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లే రికార్డు.1993లో దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆ తర్వాత 2002లో బ్రాడ్ యంగ్, 2003లో హాండ్‌స్కోంబ్ , 2025లో అరీన్ సంగ్మా, 2025లో హ్యారీ బ్రూక్ కూడా 5 క్యాచ్‌లు అందుకున్నారు.
త్రిపురతో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేరళ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు చేసింది. కేరళ బ్యాటర్లు విష్ణు వినోద్(102) సెంచరీ అదరగొట్టాడు. బాబా అపరజిత్(64), రోహన్(94) రాణించారు. అయితే కేరళ విధించిన భారీ టార్గెట్‌ను చేధించడంలో త్రిపుర తడబడింది. దీంతో 36.5 ఓవర్లలో 203 పరుగులు చేసి ఓటమిని ఒప్పకుంది. కేరళ 145 పరుగుల తేడాతో విజయం సాధించింది. తన క్యాచ్‌లతో కేరళ విజయంలో విఘ్నేశ్ పుతుర్ కీలక పాత్ర పోషించాడు. కేరళ బౌలర్లలో బాబా అపరాజిత్ 5 వికెట్లు పడగొట్టాడు. విజ్ఞేష్ పుతుర్ ఒక వికెట్ తీశాడు.
గతేడాది ఐపీఎల్ 2025లో మంచి ప్రదర్శన చేసి వార్తల్లో నిలిచాడు విఘ్నేశ్ పుతుర్. అయితే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ అతడిని రిలీజ్ చేసింది. ఇటీవల అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో విఘ్నేశ్‌ను రూ.30 లక్షల ప్రారంభ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
