Site icon HashtagU Telugu

Virat Kohli : కోహ్లీని చూస్తే బాధేస్తోంది

Kapil Dev Kohli

Kapil Dev Kohli

గత కొంతకాలంగా పేలవ ఫామ్ కారణంగా విరాట్ కోహ్లి అనేక విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. అతడు సెంచరీ సాధించి మూడేళ్లు అవుతోంది. చివరిగా 2019లోమూడెంకల స్కోరు సాధించాడు. ఐపీఎల్ 15వ సీజన్ లో పూర్తిగా నిరాశపరిచాడు. రానున్న ఇంగ్లాండ్ సిరీస్ కోహ్లి కెరీర్ కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కోహ్లిపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి లాంటి ఓ టాప్ ప్లేయర్ సెంచరీ సాధించడానికి మూడేళ్లు గ్యాప్ తీసుకోవడం బాధ కలిగిస్తోందని కపిల్ దేవ్ అన్నాడు. కొన్నాళ్లుగా అతడి ఫామ్ చాలా ఆందోళనను కలిగిస్తోందన్నాడు. అతడి ఆటతీరు టీమ్ కు ఇబ్బందికరంగా మారిందని , హీరోలా అందరికి స్ఫూర్తిగా నిలిచిన ఆటగాడు ఇలాంటి స్థితికి రావడం ఊహించలేదన్నాడు. సచిన్, ద్రావిడ్, గవాస్కర్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాల స్థాయిలో గొప్ప ఆటగాడిగా అందరూ అతడిని కీర్తించారని, ఇప్పుడు మాత్రం వారితో పోల్చడానికి ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నాడు. గత రెండేళ్లుగా కోహ్లి ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నాడంటే ఎక్కడో తప్పు జరుగుతుందన్న కపిల్ పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించాడు. ప్లేయర్ సరిగా ఆడకుంటే ప్రశ్నలు వేయకుండా సైలెంట్ గానే ఉంటారని అనుకోవడం తప్పవుతుందన్నాడు. ఓ మాజీ ప్లేయర్ గా ఏవరి ఆటతీరు బాగా లేకపోయినా ప్రశ్నించే హక్కు తనకు ఉందన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న కోహ్లీ టెస్ట్ సిరీస్ లో రాణించేందుకు ఎదురుచూస్తున్నాడు. కెప్టెన్సీ ఒత్తిడి నుంచి బయటపడినా కోహ్లీ ఇంకా ఫామ్ అందుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగే చివరి టెస్టులో శతకంతో జట్టుకు చారిత్రక సిరీస్ విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version