భారత పేస్ విభాగంలో జహీర్ ఖాన్ ఎంత గ్రేట్ బౌలరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన పేస్ తో ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయి లెఫ్టార్మ్ పేసర్ భారత్ కు దొరకలేదు. ఖలీల్ అహ్మద్, జైదేవ్ ఉనాద్కట్ వంటి వాళ్లు వచ్చినా.. టాప్ క్లాస్ ప్రదర్శన మాత్రం కనబరచలేకపోయారు. నిలకడగా రాణించలేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్ళినవారే. దీంతో పదునైన లెఫ్టార్మ్ పేసర్ కోసం టీమిండియా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అర్షదీప్ సింగ్ రూపంలో మంచి బౌలర్ భారత్ కు దొరికాడని పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యానించాడు.
అర్షదీప్ అద్భుతమైన బౌలర్ అని, అతన్ని చూస్తుంటే జహీర్ ఖాన్ గుర్తొస్తున్నాడని ప్రశంసించాడు. మానసికంగా ఎంతో ధృఢంగా కనిపిస్తున్నాడని, పేస్ తో పాటు స్వింగ్ తోనూ ఆకట్టుకుంటున్నాడని అక్మల్ చెప్పుకొచ్చాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా రాణిస్తున్న అర్షదీప్ సింగ్ టీమిండియా కొత్త జహీర్ ఖాన్ అని కితాబిచ్చాడు. సౌతాఫ్రికాతో టీ ట్వంటీ అతని బౌలింగ్ అద్భుతంగా ఉందన్నాడు. డికాక్, మిల్లర్ లను వికెట్లు తీయడం ద్వారా తన బౌలింగ్ సామర్థ్యం ఏంటో అందరికీ చాటిచెప్పాడని పాక్ మాజీ ఆటగాడు అభిప్రాయపడ్డాడు. జహీర్ ఖాన్ లాంటి టాప్ క్లాస్ పేసర్ లేని లోటు అర్షదీప్ ద్వారా తీరే అవకాశముందన్నాడు. వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అర్షదీప్ సింగ్ టీమిండియాకు కీలకం కానున్నాడని అక్మల్ విశ్లేషించాడు. బూమ్రా అందుబాటులో లేకుంటే ఖచ్చితంగా భారత్ కు అర్షదీప్ తన బౌలింగ్ తో అడ్వాంటేజ్ గా మారతాడని అంచనా వేశాడు.