Site icon HashtagU Telugu

Kagiso Rabada : వన్డే సిరీస్ కు సఫారీ స్టార్ బౌలర్ దూరం

Kagiso Rabada

Kagiso Rabada

భారత్ తో తొలి వన్డేకు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ క‌గిసో ర‌బాడ ఈ సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. కేవలం పని భారం తగ్గించేందుకు అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు సఫారీ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అత‌ని స్థానంలో ప్ర‌స్తుతానికి క్రికెట్ సౌతాఫ్రికా ఎవ‌రిని ఎంపిక చేయ‌లేదు.
గత కొంత‌కాలంగా రబాడ వ‌రుస‌గా మ్యాచ్‌లు ఆడుతునున్నాడు. బబూల్ లో సమయం గడుపుతుండడం, తీరిక లేని షెడ్యూల్ దృష్ట్యా బోర్డు కూడా వెంటనే అతని నిర్ణయాన్ని స్వాగతించింది. దీనికి తోడు వ‌చ్చే నెల‌లో న్యూజిలాండ్‌తో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్ నుండి విశ్రాంతి తీసుకోవడమే మంచిదని సఫారీ టీమ్ మేనేజ్ మెంట్ కూడా భావించింది.

దక్షిణాఫ్రికా జ‌ట్టులో చాలా కాలంగా సీనియర్ బౌల‌ర్‌గా కొన‌సాగుతున్న ర‌బాడ ఆ జట్టు విజ‌యాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీమిండియాతో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో సఫారీలు గెల‌వ‌డంలో ర‌బాడదే కీ రోల్. ఈ సిరీస్‌లోనే ఎక్కువ వికెట్లు తీసిన బౌల‌ర్‌గా కూడా నిలిచాడు. ఈ సిరీస్ లో ర‌బాడ 19.05 సగటుతో 20 వికెట్లు తీశాడు. కెరీర్‌లో ఇప్ప‌టివ‌రకు 50 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ర‌బాడ 233 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అదే వ‌న్డేల్లో అయితే 82 మ్యాచ్‌లు ఆడి 126 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక 40 టీ20 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు తీశాడు. రబాడా వన్డే సిరీస్‌ నుండి తప్పుకోవడం భారత జట్టుకు గొప్ప రిలీఫ్ గా చెప్పొచ్చు. ,26 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ భారత్‌తో ఆడిన 12 వన్డేల్లో 17 వికెట్లు పడగొట్టాడు.తన సొంత గడ్డపై మరింతగా చెలరేగే రబాడ 37 మ్యాచ్‌లలో 54 వికెట్లు తీశాడు.