Site icon HashtagU Telugu

Jos Buttler:రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేయాలనుంది

Jos Buttler Rohit

Jos Buttler Rohit

ఐపీఎల్‌-2022లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ప‌రుగుల సునామి సృష్టిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ప్రతీ జట్టుపై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజన్ లో 7 మ్యాచ్‌లు ఆడిన జోస్ బ‌ట్ల‌ర్ 81.83 సగటుతో 491 ప‌రుగులు సాధించాడు. బట్లర్ ఇన్నింగ్స్‌ల్లో మూడు భారీ సెంచ‌రీలతో పాటు రెండు ఆఫ్ సెంచ‌రీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్ అగ్రస్థానంలో నిలిచాడు.. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో బట్లర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రస్తుత తరంలో ఓపెనింగ్ భాగస్వామిగా ఎవరితో కలిసి బరిలోకి దిగాలనుకుంటున్నారు అని బట్లర్ ను అడగ్గా.. టీమిండియా కెప్టెన్ ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ పేరు చెప్పాడు.

అలాగే మాజీ ఆటగాళ్లలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తో కలిసి బ్యాటింగ్ చేయాల్సి ఉందని తెలిపాడు. ఇక ఐపీఎల్ లో తనని అత్యంత ఇబ్బంది పెట్టిన బౌలర్ రషీద్ ఖాన్ గా పేర్కొన్న బట్లర్ 2018 సీజన్ లో ముంబై ఇండియన్స్ పై ఆడిన ఇన్నింగ్స్ తన ఫెవరెట్ అని చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. ఈ సీజన్ లో 11 ఏళ్ల క్రితం నాటి క్రిస్ గేల్ రికార్డును బట్లర్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2011 సీజ‌న్‌లో గేల్ త‌న తొలి 7 మ్యాచ్‌లలో 436 పరుగులు చేయగా.. ప్రస్తుత సీజ‌న్‌లో బ‌ట్ల‌ర్ తొలి 7 మ్యాచ్‌ల్లో 491 ప‌రుగులు సాధించి గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో తొలి 7 మ్యాచ్‌ల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా బ‌ట్ల‌ర్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న బట్లర్ మూడు సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు.