RR In Finals: బట్లర్ శతకమోత…ఫైనల్లో రాజస్థాన్

ఐపీఎల్ 15వ సీజన్‌లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ సూపర్ ఫామ్‌ కొనసాగుతోంది.

  • Written By:
  • Updated On - May 27, 2022 / 11:23 PM IST

ఐపీఎల్ 15వ సీజన్‌లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ సూపర్ ఫామ్‌ కొనసాగుతోంది. వరుసగా నాలుగో సెంచరీతో బట్లర్ చెలరేగిన వేళ రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. అదృష్టంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయింది. బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్ళ వైఫల్యం ఆ జట్టు ఓటమికి కారణమైంది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. సిక్స్ కొట్టి జోరు మీద కనిపించిన కోహ్లీ 7 పరుగులకే ఔటవగా…రజత్ పటీదార్, డుప్లెసిస్ ఇద్దరూ ఇన్నింగ్స్ గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 70 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డుప్లెసిస్ ఔటైన తర్వాత మాక్స్‌వెల్ కాసేపు నిలకడగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా..పటిదార్ మరోసారి ఆకట్టుకున్నాడు. ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే పటిదార్ 54 పరుగులకు ఔటైన తర్వాత బెంగళూరు ఇన్నింగ్స్ వేగంగా పతనమైంది. క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అంచనాలు పెట్టుకున్న దినేశ్ కార్తీక్, లామ్రోర్ నిరాశపరిచారు. లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. చివరి రెండు ఓవర్లలో బెంగళూరు జట్టు కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే రాజస్థాన్ ఎలా కట్టడి చేసిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో భారీస్కోర్ చేస్తుందనుకున్న ఆర్సీబీ 157 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో మెక్‌కాయ్ 3, ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్‌లో రాజస్థాన్ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడింది. బెంగళూరు బౌలర్లపై ఓపెనర్లు జైశ్వాల్, బట్లర్ ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలో 61 పరుగులు జోడించారు. జైశ్వాల్ ఔటైనా… బట్లర్ మాత్రం రెచ్చిపోయాడు. బెంగళూరు బౌలర్లను ఆటాడుకున్నాడు. సంజూ శాంసన్ 23 రన్స్‌తో సపోర్ట్ ఇవ్వగా.. బట్లర్ ధాటిగా ఆడాడు. కేవలం 60 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో బట్లర్‌కు ఇది నాలుగో శతకం.^దీంతో ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బట్లర్ సమం చేశాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక శతకాలు చేసిన మూడో బ్యాటర్‌గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో గేల్ 6 శతకాలతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. బట్లర్ 5, కోహ్లీ 5 సెంచరీలతో తర్వాత నిలిచారు. కాగా బట్లర్ జోరుతో రాజస్థాన్ 18.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అంచనాలు పెట్టుకున్న హసరంగా కూడా రాణించలేదు. కాగా ఆదివారం జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి.