Jos Buttler : అట్లుంటాది బట్లర్ తోని..

ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాడు జాస్ బట్లర్ హవా నడుస్తోంది. బట్లర్ ఫార్మేట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 02:54 PM IST

ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాడు జాస్ బట్లర్ హవా నడుస్తోంది. బట్లర్ ఫార్మేట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 15వ సీజన్ తో ప్రారంభమైన బట్లర్ పరుగుల దాహం కొనసాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇంగ్లండ్‌ క్రికెటర్ తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. బంతి దొరికిందే ఆలస్యం అన్నట్లుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. డెడ్‌ బాల్‌, వైడ్‌ బాల్‌, నో బాల్‌ అనే లెక్క లేకుండా భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో దడ పుట్టిస్తు‍న్నాడు. మొన్నటివరకు ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున వరుస సెంచరీలతో హోరెత్తించి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్న బట్లర్‌ అంతర్జాతీయ క్రికెట్ లోనూ దుమ్మురేపుతున్నాడు. నెదర్లాండ్స్ పై తొలి వన్డేలో 162 పరుగుల సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తాజాగా మూడో వన్డేలో 86 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌తో మెరిసాడు. ఈ వన్డే మ్యాచ్‌లో బట్లర్‌ కొట్టిన ఒక సిక్స్‌ హైలైట్‌గా నిలిచింది. నెదర్లాండ్స్‌ బౌలర్‌ పాల్‌ వాన్‌ వేసిన 29వ ఓవర్ ఐదో బంతి స్లో అయ్యి క్రీజు పక్కకు పోయింది. ఎందుకు వదలడం అనుకున్నబట్లర్‌ క్రీజు నుంచి మొత్తం పక్కకు జరిగి భారీ సిక్సర్‌ కొట్టాడు. అంపైర్‌ డెడ్‌ బాల్‌గా పరిగణించడంతో పాటు నో బాల్‌ ఇచ్చి ఫ్రీ హిట్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఫ్రీ హిట్‌ను కూడా బట్లర్‌ సిక్సర్‌గా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్‌ నిర్ధేసించిన 245 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 30.1 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది