Rajasthan scores over Punjab: చెలరేగిన జైశ్వాల్.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ 15వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది.

  • Written By:
  • Publish Date - May 7, 2022 / 09:32 PM IST

ఐపీఎల్ 15వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన ఆ జట్టు కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్ తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ధావన్ 12 రన్స్‌కే ఔటైనా… బెయిర్‌స్టో ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. రాజపక్స, మయాంక్ అగర్వాల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బెయిర్ స్టో 40 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 56 పరుగులు చేయగా.. చివర్లో జితేశ్ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. లివింగ్ స్టోన్ కూడా ధాటిగా ఆడి 22 రన్స్ చేయడంతో పంజాబ్ భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా… ప్రసిద్ధ కృష్ణ, అశ్విన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఛేజింగ్‌లో రాజస్థాన్‌కు ఓపెనర్లు జైశ్వాల్, బట్లర్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. 4 ఓవర్లలోనే 46 పరుగులు జోడించారు. ఫామ్‌లో ఉన్న బట్లర్ 16 బంంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 30 పరుగులకు ఔటవగా… జైశ్వాల్ మాత్రం తన జోరు కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన జైశ్వాల్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ 23 , పడిక్కల్ 31 రన్స్‌తో రాణించగా.. వీరిద్దరూ కీలక సమయంలో ఔటైన తర్వాత మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే హెట్‌మెయిర్ భారీ షాట్లతో రాజస్థాన్‌కు విజయాన్ని అందించాడు. హెట్‌మెయిర్ 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మరో రెండు బంతులు మిగిలుండగా లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకోగా… పంజాబ్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ మిగిలిన మూడు మ్యాచ్‌లలోనూ మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది.