Ind Vs Eng: బెయిర్ స్టో రికార్డుల జోరు

క్రికెట్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ లకు ఎంతో విలువ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 08:45 AM IST

క్రికెట్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ లకు ఎంతో విలువ ఉంటుంది. గత కొంత కాలంగా ఇంగ్లాండ్ క్రికెటర్ జానీ బెయిర్ స్టో ఇదే పరిస్థితిని ఆస్వాదిస్తున్నాడు. టీమ్ కష్టాల్లో ఉన్న ప్రతీసారీ ఆపద్బాంధవునిగా మారాడు. కివీస్ తో టెస్ట్ సీరీస్ లో చెలరేగిన బెయిర్ స్టో తాజాగా భారత్ తో జరుగుతున్న టెస్టులోనూ అదరగొట్టాడు. సెంచరీతో జట్టును ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు. 119 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బిల్లింగ్స్‌తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బెయిర్‌ స్టో తాజా సెంచరీతో పలురికార్డులు సాధించాడు. 2016 తర్వాత టీమిండియాపై అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు.

బెయిర్‌ స్టోకి టెస్టుల్లో ఇది 11వ సెంచరీ. వరుసగా మూడు టెస్టుల్లో 100 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ 15 వ ఆటగాడిగానూ బెయిర్‌ స్టో రికార్డు నెలకొల్పాడు. ఐదో స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బెయిర్‌ స్టో నిలిచాడు. 2012లో ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్‌ క్లార్క్‌ ఐదు సెంచరీలు చేశాడు. ఈ సీజన్ లో బెయిర్‌ స్టో మంచి ఫామ్ లో ఉన్నాడు. గత రెండు టెస్టు మ్యాచుల్లోనూ బెయిర్‌ స్టో పరుగుల వరద పారించాడు. ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో న్యూజిలాండ్‌ పై 136 , హెడింగ్లీలో జరిగిన మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో 162, రెండో ఇన్నింగ్స్ లో 71 పరుగులతో చెలరేగిపోయాడు. ఇప్పుడు భారత్ పైనా శతకం సాధించి జట్టును ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించాడు.