JIO Cinema Viewer Ship: ధోనీ నా… మజాకా… రికార్డు వ్యూయర్ షిప్

లీగ్ ఆరంభం నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ ఫాన్స్ ను అలరిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్ లో కొనసాగుతున్న మహి తనదయిన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు.

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 12:34 PM IST

JIO Cinema Viewer Ship : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న క్రేజే వేరు. లీగ్ ఆరంభం నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ ఫాన్స్ ను అలరిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్ లో కొనసాగుతున్న మహి తనదయిన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మునుపటి ధోనీని గుర్తు చేశాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ధోనీ క్రీజులో అడుగుపెట్టినప్పుడు స్టేడియం హోరెత్తిపోయింది. చెన్నై గెలుపుకు కావాల్సిన రన్ రేట్ పెరిగిపోవడం.. ధోనీ భారీ షాట్లతో విరుచుకు పడడం జరిగాయి.. 30 బంతుల్లో 63 పరుగులు కావాల్సిన పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన ధోనీ.. జడేజాతో కలిసి గెలిపించినంత పనిచేశాడు. మొత్తం మూడు సిక్సర్లతో పాటు ఓ బౌండరీ బాదిన ధోనీ.. అభిమానులందర్నీ అలరించాడు.

ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడింది 17 బంతులే అయినా.. 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధోనీ బ్యాటింగ్‌కు రాగానే జియో సినిమా వ్యూస్ రూ. 2 కోట్ల మార్క్‌ను ధాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్స్‌లు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు (JIO Cinema) ఆల్‌టైమ్ రికార్డు. ధోనీ బ్యాటింగ్ ముందు వరకు కోటి 60 లక్షల వ్యూస్ ఉండగా.. అతను రాగానే మరో 60 లక్షల వ్యూస్ అమాంతం పెరిగాయి. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేసినప్పుడు 1.7 కోట్ల వ్యూస్ రాగా.. ఆర్‌సీబీ, లక్నో మ్యాచ్‌లో 1.8 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజా మ్యాచ్ బ్రేక్ చేసింది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది.తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమిపాలైంది. చివర్లో ధోనీ, జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ తో కట్టడి చేశాడు. చివరి మూడు బంతుల్లో 7 పరుగులు డిఫెండ్ చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.

Also Read:  Dhoni: ధోనీ ధనాధన్ మెరుపులు.. కానీ CSK తప్పిదం