Site icon HashtagU Telugu

Jaydev Unadkat: అప్పుడు 11.5 కోట్లు.. ఇప్పుడు 50 లక్షలే

Jaydev Unadkat:

Resizeimagesize (1280 X 720)

ఐపీఎల్‌లో ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి..వరల్డ్ క్రికెట్‌లో రిచ్చెస్ట్ లీగ్‌గా పేరున్న ఐపీఎల్‌లో ఆటగాళ్ళ ప్రదర్శనతోనే వారికొచ్చే భారీ ధర ముడిపడి ఉంటుంది. స్టార్ ప్లేయర్స్‌ అయినా, యువక్రికెటర్లయినా ఫామ్ కోల్పోతే అమ్ముడుపోవడం కష్టం. ఇక ఒక సీజన్‌లో రికార్డు ధర పలికిన ఆటగాడు తర్వాతి వేలంలో అసలు అమ్ముడుపోని సందర్భాలూ ఉన్నాయి.. అదే సమయంలో కనీస ధరకే అమ్ముడుపోవడం కూడా జరుగుతుంది. తాజాగా ఐపీఎల్ మినీ వేలంలో భారత పేస్ బౌలర్ జై దేవ్ ఉనాద్కట్‌ (Jaydev Unadkat) 50 లక్షలకు అమ్ముడయ్యాడు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అతన్ని ద‌క్కించుకుంది. దేశ‌వాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఉనాద్కట్ (Jaydev Unadkat) 2018 త‌ర్వాత ఇంత త‌క్కువ ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డం ఆశ్చర్యమే. 2018లో అత‌డిని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 11.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో ఉనాద్కట్ పెద్దగా రాణించలేదు. అయినప్పటకీ 2019లో అత‌డిని 8.4 కోట్లకు మ‌ళ్లీ కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ 2020-21లో 3 కోట్లకు ఉనాద్కట్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అట్టిపెట్టకుంది. పోయిన సీజ‌న్ వేలంలో ఉనాద్కట్‌ను ముంబై ఇండియ‌న్స్ 1.3 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈసారి మినీవేలంలోకి ముంబై వదిలేసింది. 2010లో కేకేఆర్ త‌ర‌ఫున ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేసినప్పటకీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే 2017 ఐపీఎల్ సీజన్‌తో ఉనాద్కట్ కెరీర్‌ మలుపు తిరిగింది. ఆ సీజ‌న్‌లో పూణె సూప‌ర్ జెయింట్స్‌ తరపను బరిలోకి దిగి 12 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు. ఆ తర్వాత నిలకడగా రాణించకపోవడం పలు జట్లు మారాల్సి వచ్చింది. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఉనాద్కట్ అదరగొడుతున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనతోనే చాలా రోజుల తర్వాత భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.