IND vs SL: శ్రీలంక క్రికెట్ జట్టు గత కొంత కాలంగా ఎలా ఆడుతుందో అందరికీ తెలుసు… టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కనీసం లీగ్ స్టేజ్ దాటలేకపోయింది… అలాగే వన్డేల్లోనూ చిన్న జట్ల చేతిలో ఓడిన సందర్భాలూ ఉన్నాయి… సొంతగడ్డపై కూడా చెత్త ప్రదర్శనతో నిరాశపరిచిన రోజులూ కనిపించాయి…అలాంటి శ్రీలంక జట్టు ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ స్థాయిలో ఉన్న భారత్ ను ఓడించింది… అది కూడా పలువురు కీలక ఆటగాళ్ళు గాయాలతో దూరమైనా, మరికొందరు జట్టులో లేకున్నా అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాకు షాకిచ్చింది. ముఖ్యంగా టీ ట్వంటీ సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు వన్డేల్లో మాత్రం చేతులెత్తేయడం ఇక్కడ హాట్ టాపిక్. ఎందుకంటే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఈ సిరీస్ నుంచే ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాడు. సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి కోరినా తిరస్కరించి వారిని ఆడించాడు.
ఇక కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లాంటి సీనియర్లను జట్టులోకి తీసుకుని వన్డే సిరీస్ రెడీ అయ్యాడు. అయితే ఫలితం మాత్రం వ్యతిరేకంగా వచ్చింది. దీనికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే.. అయితే లంక జట్టులో కీలకమైన బౌలర్లు లేరు. పతిరణ వంటి పేసరూ లేడు. కొత్తగా వచ్చిన యువ స్పిన్నర్లు, ఇప్పుడిప్పుడే జట్టులో కీలకంగా ఎదుగుతున్న ఆటగాళ్ళే ఉన్నారు. నిజానికి స్పిన్ ను ఎదుర్కొని ఇబ్బందిపడే బలహీనత మన బ్యాటర్లకు లేదు. అయితే ఈ సిరీస్ లో స్పిన్ ఉచ్చులోనే భారత బ్యాటర్లు చిక్కుకున్నారు. గతంలో ఆ జట్టులోని స్లో బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం లేకపోవడం, వారిపై అంత ఫోకస్ పెట్టకపోవడం, వారిని తేలిగ్గా తీసుకోవడమే ఓటమికి కారణమైందని చెప్పొచ్చు.
ఒకవిధంగా శ్రీలంక జట్టుకు భారత్ పై సిరీస్ విజయం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెంచుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పలువురు కీలక ఆటగాళ్ళు దూరమైనప్పటికీ కూడా చక్కని ఆటతీరుతో టీమిండియాను నిలువరించింది. భారత్ కు గంభీర్ కొత్త కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకకు జయసూర్య హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు. ఈ టూర్ తోనే తమ తమ కోచింగ్ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. టీ ట్వంటీ సిరీస్ కోల్పోయిన తర్వాత శ్రీలంక జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన రోహిత్ సేన కూడా ఊహించి ఉండదనేది పలువురి విశ్లేషణ. నిజానికి తొలి వన్డేలో కూడా శ్రీలంకనే గెలిచే అవకాశముండేదని, అదృష్టవశాత్తూ టైగా ముగిసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ అదే జరిగి ఉంటే వన్డే సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చేది.
Also Read: Bangladesh Protests: భారత్‌లోకి చొరబడేందుకు బంగ్లాదేశీయులు ప్రయత్నం