Site icon HashtagU Telugu

Asia Cup 2023: స్వదేశానికి బూమ్రా… కారణం ఏంటో తెలుసా ?

Jasprit Bumrah

Jasprit Bumrah

Asia Cup 2023: ఆసియాకప్‌లో నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. దీంతో నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కు బూమ్రా అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో షమీకి చోటు దక్కనుంది. కాగా గాయాలతో దాదాపు 10 నెలలకు పైగా ఆటకు దూరమైన బూమ్రా ఇటీవలే ఐర్లాండ్‌తో సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్‌లో భారత కెప్టెన్‌గా వ్యవహరించిన బూమ్రా తనదైన పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
అయితే హఠాత్తుగా బూమ్రా స్వదేశానికి వెళ్లిపోవడంతో పలు వార్తలు షికారు చేశాయి. ఫిట్‌నెస్ సమస్యలా.. మరేదైనా కారణమా అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. దీంతో బోర్డు వర్గాలు దీనిపై క్లారిటీ ఇచ్చాయి. బుమ్రా త్వరలోనే తండ్రి కాబోతున్నాడనీ, అతని సతీమణి, సంజనా గణేషన్ త్వరలో బిడ్డకు జన్మనివ్వనుండడంతో బూమ్రా స్వదేశానికి తిరిగి వచ్చేసినట్టు తెలిపాయి.

డెలివరీ టైమ్ దగ్గరపడటంతోనే తన భార్య పక్కనే ఉండేందుకు బుమ్రా బోర్డు అనుమతి తీసుకుని ముంబై వచ్చినట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లో బుమ్రా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. గతంలో విరాట్ కోహ్లీ కూడా తన సతీమణి అనుష్క శర్మ ప్రసవ సమయంలో భారత జట్టును ఆసీస్ టూర్ మధ్యలో విడిచి స్వదేశానికి వచ్చాడు. ఇదిలా ఉంటే ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయానికి బుమ్రా మళ్లీ జట్టుతో కలవనున్నాడు.
ఇక పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేయకపోయినా.. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు జోడించాడు. మరోవైపు ఆసియాకప్‌ను వరణుడు వెంటాడుతూనే ఉన్నాడు. ఇవాళ నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దయ్యింది. ఇక్కడే శనివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పాకిస్థాన్ బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసి చెరొక పాయింట్ కేటాయించారు. అయితే సూపర్ 4 మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశాలుండడంతో వేదికను మార్చాలని నిర్వాహకులు భావిస్తున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read: Telangana: తెలంగాణకు 30 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం