World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఐదో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడింది. చెన్నైలోని చిదంబరం క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కంగారూ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉంటే మ్యాచ్ ప్రారంభమైన వెంటనే జార్వో అనే అభిమాని భారత జట్టు జెర్సీని ధరించి మిడిల్ ఫీల్డ్‌లోకి ప్రవేశించాడు. జార్వో రాకతో సిబ్బంది మైదానంలోకి పరుగెత్తుకుని వచ్చి బయటకు పంపించే ప్రయత్నం చేసింది. అయితే జార్వో బ్రో మాత్రం కొద్దిసేపు వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు జార్వో దగ్గరకు కోహ్లీ వచ్చి వెళ్లిపోవాలని కోరాడు. దాంతో జార్వో కోహ్లీ మాటను గౌరవించి పెవిలియన్ లోకి వచ్చాడు. జార్వోపై ఐసీసీ సీరియస్ అయింది. ప్రపంచ కప్ మొత్తానికి జార్వోని అనుమతించబోమని నిషేధం విధించింది.
వాస్తవానికి 2021లో భారత్ ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా జార్వో వార్తల్లో నిలిచాడు. 2021లో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి ప్రవేశించాడు జార్వో. ఆ తర్వాత లార్డ్స్, హెడింగ్లీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లోనూ అతను ఇదే విధంగా ప్రవర్తించాడు. జెర్సీ ధరించి చేతిలో బ్యాట్, తలకు హెల్మెట్‌తో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత టీమిండియా ఫీల్డింగ్ చేస్తుండగా ఆకస్మాత్తుగా మైదానంలోకి ప్రవేశించి బంతి లేకపోయినా.. బౌలింగ్ యాక్షన్ ఇస్తూ పరుగెత్తి ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్‌స్టోను ఢీకొట్టబోయాడు. జార్వోకు సంబందించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చెన్నై వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఐదవ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా మ్యాజిక్ ఫలించింది. జడ్డూ అద్భుతంగా బౌలింగ్ చేసి స్టీవ్ స్మిత్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. జడేజా తర్వాతి ఓవర్‌లో మార్నస్ లాబుషాగ్నే, అలెక్స్ కారీలకు పెవిలియన్ దారి చూపించాడు. తన 10 ఓవర్ల స్పెల్‌లో జడేజా 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.దాంతర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు మొదట్లోనే భారీ షాకులు తగిలాయి. రోహిత్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ జీరో స్కోరుకే పెవిలియన్ చేరారు. కోహ్లీ, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడి జట్టుని విజయతీరాలకు చేర్చారు. ఆస్ట్రేలియా 49.3 ఓవర్లకు పది వికెట్లు కోల్పోయి 199కి ఆలౌట్ అవ్వగా, టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి మరో తొమ్మిది ఓవర్లు ఉండగానే 201 పరుగులు చేసి ఘన విజయం సాదించింది.
Virat Kohli & Jarvo moment in Cheapuk. pic.twitter.com/BGcF1VzLWC
— Johns. (@CricCrazyJohns) October 8, 2023
Also Read: World Cup 2023: ప్రపంచ కప్ లో భారత్ బోణి.. ఆసీస్ చిత్తు