SRH Demolishes RCB: సన్ రైజర్స్ చేతిలో బెంగళూరు చిత్తు

ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ 15వ సీజన్ లో శనివారం జరిగిన రెండో మ్యాచ్ పూర్తి వన్ సైడ్ గా ముగిసిపోయింది

  • Written By:
  • Publish Date - April 23, 2022 / 11:11 PM IST

ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ 15వ సీజన్ లో శనివారం జరిగిన రెండో మ్యాచ్ పూర్తి వన్ సైడ్ గా ముగిసిపోయింది. ఈ సీజన్ లో అదిరిపోయే ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తన జైత్రయాత్ర కొనసాగించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. బౌలింగ్ తోనే చాలా సీజన్లలో వరుస విజయాలు అందుకున్న విలియమ్సన్ సేన్ ఈ సారి కూడా అదే అలవాటును కొనసాగిస్తోంది. మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

క్రీజులో నిలిచేందుకు కూడా ఇష్టం లేనట్టు.. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి ఆర్ సీబీ బ్యాటర్లు చేతులెత్తేశారు.సుయాశ్ ప్రభుదేశాయ్(15), గ్లేన్ మ్యాక్స్‌వెల్(11) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ(0)తో పాటు అనూజ్ రావత్(0), దినేశ్ కార్తీక్(0) డకౌటయ్యారు. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించలేదు. దీంతో బెంగళూరు కేవలం 68 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ హైదరబాద్ బౌలర్ మార్కో జాన్సెన్ తనదైన పేస్ తో ఆర్సీబీ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. 25 పరుగులు ఇచ్చిన జాన్సెన్ 3 వికెట్లు తీయగా.. నటరాజన్ కూడా 3 వికెట్లు, జగదీష్ సుచీత్ రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌లకు తలో వికెట్ దక్కింది.

స్వల్ప టార్గెట్ ను చాలా తక్కువ ఓవర్లలో ఛేదించే లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. పవర్ ప్లేలోనే మ్యాచ్ ను ముగించేలా కనిపించారు. అభిషేక్ శర్మ తన ఫామ్ కొనసాగించగా… విలియమ్సన్ కూడా రాణించాడు. దీంతో 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. తర్వాత రెండు ఓవర్లలో జట్టు విజయాన్ని పూర్తి చేసింది.అభిషేక్ శ‌ర్మ‌47 ప‌రుగుల‌తో దుమ్మురేపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి 72 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. కేన్ విలియమ్సన్ 16 నాటౌట్, రాహుల్ త్రిపాఠి7 నాటౌట్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ భారీ విజయంతో రన్‌రేట్‌ను మెరుగుపరుచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది.