Punjab Kings: పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు (Punjab Kings) 219 పరుగులు సాధించగా, రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్‌లో తమ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. పంజాబ్ విజయంలో నెహల్ వాధేరా (70 పరుగులు), హర్‌ప్రీత్ బ్రార్ (3 కీలక వికెట్లు) ప్రధాన పాత్ర పోషించారు.
జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు 220 పరుగుల లక్ష్యం లభించింది. యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ జట్టుకు ధీటైన ఆరంభాన్ని అందించారు. 5 ఓవర్లలోనే 60 పరుగులు దాటించారు. అయితే సూర్యవంశీ 15 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. జైస్వాల్ 25 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 పరుగులు చేసి ఫిఫ్టీ పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు.
సంజూ శాంసన్ 20 పరుగులకే ఔటయ్యాడు. రియాన్ పరాగ్ 13 పరుగుల వద్ద హర్‌ప్రీత్ బ్రార్ చేత క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాజస్థాన్‌కు పెద్ద భాగస్వామ్యం లేకపోవడం సమస్యలను పెంచింది. ధ్రువ్ జురెల్ ఒక వైపు నిలబడ్డాడు. కానీ మరో వైపు నుంచి సహకారం లభించలేదు. జురెల్, షిమ్రాన్ హెట్‌మయర్ మధ్య 37 పరుగుల భాగస్వామ్యం ఉంది. హెట్‌మయర్ 11 పరుగుల వద్ద ఔటైనప్పుడు.. రాజస్థాన్‌కు 16 బంతుల్లో 39 పరుగులు అవసరమయ్యాయి.
Also Read: Liquor Rates Hike : కిక్ లేకుండా చేస్తావా అంటూ సీఎం రేవంత్ పై మందుబాబులు గరం గరం
చివరి ఓవర్‌లో 30 పరుగులు కావాల్సి ఉండగా 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ కేవలం 8 పరుగులు ఇచ్చి మ్యాచ్‌ను పంజాబ్ వైపు మొగ్గేలా చేశాడు. చివరి ఓవర్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్ చేయగా మొదటి 4 బంతుల తర్వాతే ఫలితం స్పష్టమైంది. మొదటి రెండు బంతుల్లో 2 పరుగులు, తర్వాతి రెండు బంతుల్లో జురెల్, వనిందు హసరంగాను ఔట్ చేశాడు. చివరి రెండు బంతుల్లో రెండు ఫోర్లు వచ్చినా రాజస్థాన్‌కు లాభం లేకపోయింది.