Site icon HashtagU Telugu

Wasim Jaffer : వాన్ కు జాఫర్ దిమ్మతిరిగే కౌంటర్

Wasim Jaffer Copy

Wasim Jaffer Copy

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్ వాన్‌, టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ మధ్య ట్విటర్‌ వార్‌ ఇప్పటిది కాదు. వీళ్లు ఒకరిపై మరొకరు కౌంటర్‌ వేసుకుంటూనే ఉంటారు. తాజాగా మరోసారి వీళ్ల మధ్య ట్విటర్‌ వార్‌ మొదలైంది. తాజాగా జాఫర్‌ చేసిన ఓ ట్వీట్‌కు మైకేల్‌ వాన్‌ కౌంటర్‌ వేయడం.. దానిని జాఫర్‌ తనదైన స్టైల్లో తిప్పికొట్టడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. జాఫర్‌ మంగళవారం ప్రతిష్టాత్మక లార్డ్స్‌ గ్రౌండ్‌లో కూర్చొని ఓ ఫొటో దిగాడు. దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనిపై వాన్‌ స్పందిస్తూ.. నేను తొలి టెస్ట్‌ వికెట్‌ తీసుకొని 20 ఏళ్లు అయిన సందర్భంగా ఇక్కడికి వచ్చావా వసీం అంటూ వాన్‌ కామెంట్‌ చేశాడు. దీనికి జాఫర్‌ దీటుగానే బదులిచ్చాడు. 2007లో ఇంగ్లండ్‌ టూర్‌లో టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన టీమిండియా ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. దీని 15వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చాను అంటూ వాన్‌కు దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు. ఇంగ్లండ్‌లో చివరిసారి 2007లో రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలోనే ఇండియా టెస్ట్‌ సిరీస్‌ గెలిచింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0తో చేజిక్కించుకుంది. టీమిండియా గెలిచిన నాటింగ్హమ్‌ టెస్ట్‌లో మైఖేల్‌ వాన్‌ సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లండ్‌ను ఆదుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు సాధించడంతో టీమిండియా పట్టు బిగించింది. ఆ మ్యాచ్‌లో జాఫర్‌ అర్ధ సెంచరీ సహా 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక మళ్లీ ఇన్నాళ్లకు ఆ టీమ్‌ను వాళ్ల సొంతగడ్డపై మట్టి కరిపించే ఛాన్స్‌ వచ్చింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 లీడ్‌లో ఉన్న టీమిండియా.. చివరి టెస్ట్‌ను కనీసం డ్రా చేసుకున్నా సిరీస్‌ గెలవచ్చు. 2007లో కెప్టెన్‌గా ఉన్న ద్రవిడే ఇప్పుడు టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.