India wins T20: టీ ట్వంటీ సీరీస్ మనదే

వేదిక మారినా టీమిండియా జోరు మాత్రం మారలేదు. ఇంగ్లాండ్ పై మరోసారి ఆధిపత్యం కనబరిచిన వేళ టీ ట్వంటీ సీరీస్ కైవసం చేసుకుంది. రెండో టీ ట్వంటీ లో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - July 9, 2022 / 11:07 PM IST

వేదిక మారినా టీమిండియా జోరు మాత్రం మారలేదు. ఇంగ్లాండ్ పై మరోసారి ఆధిపత్యం కనబరిచిన వేళ టీ ట్వంటీ సీరీస్ కైవసం చేసుకుంది. రెండో టీ ట్వంటీ లో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి జోరుతో మూడు ఓవర్లలోనే ఇండియా స్కోరు నలభై దాటింది. కెప్టెన్ రోహిత్ శర్మ 20 బాల్స్ లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 31 రన్స్ చేసి ఔటయ్యాడు. రోహిత్ ఔటయిన తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. పంత్ 26 , కోహ్లీ 1 పరుగుకే వెనుదిరగ్గా… సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య కూడా ఎక్కువ సమయం పాటు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దినేష్ కార్తీక్ కూడా నిరాశ పరచడంతో భారత్ 150 కూడా చేస్తుందా అనిపించింది. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా జడేజా ఒక్కడే నిలకడగా రాణించాడు. దీంతో భారత్ 170 రన్స్ చేయగలిగింది. జడేజా 29 బాల్స్ లో ఐదు పోర్లతో 46 రన్స్ చేసాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్డన్ 4, గ్రీసన్ మూడు వికెట్లు దక్కించుకున్నారు.

చేజింగ్ లో ఇంగ్లాండ్ ను భువనేశ్వర్ తొలి బంతికే దెబ్బ కొట్టాడు. రాయ్ ను డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. బట్లర్ ను కూడా తక్కువ స్కోరుకే ఔట్ చేయగా… లివింగ్ స్టోన్ ను బుమ్రా వెనక్కి పంపడంతో ఇంగ్లాండ్ మళ్లీ కోలుకోలేక పోయింది. టీ ట్వంటీ హిట్టర్ మలాన్, బ్రూక్ లను చాహల్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. తర్వాత మోయీన్ అలీ, డేవిడ్ విల్లీ పోరాడినా ఫలితం లేకపోయింది. చివరికి ఇంగ్లాండ్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటయింది. భారత
బౌలర్లలో భువనేశ్వర్3, బుమ్రా 2, చాహల్ 2 హార్డిక్ పాండ్య , హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సీరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. సీరీస్ లో చివరి మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.

Pic Courtesy- BCCI/Twitter