మినీ వేలంలో ఇంగ్లాండ్ ప్లేయర్స్ కు జాక్ పాట్

ఐపీఎల్ మినీవేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అంతా ఊహించినట్టుగానే స్టార్ ప్లేయర్స్‌ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.

  • Written By:
  • Publish Date - December 23, 2022 / 07:24 PM IST

ఐపీఎల్ మినీవేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అంతా ఊహించినట్టుగానే స్టార్ ప్లేయర్స్‌ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్స్ కోసం గట్టిపోటీ నడిచింది. దీంతో ఇంగ్లీష్ క్రికెటర్లపై కోట్లాభిషేకం కురిసింది. అంచనా వేసినట్టుగానే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ శామ్ కరన్ రికార్డు ధర పలికాడు. ఏకంగా 18.5 కోట్లకు అతను అమ్ముడయ్యాడు.  తద్వారా ఐపీఎల్ చ‌రిత్రలోనే అత్యధిక ధ‌ర ప‌లికిన ప్లేయ‌ర్‌గా రికార్డు నెలకొల్పాడు. గ‌తంలో ఈ రికార్డు సౌతాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ క్రిస్ మోరిస్ పేరుమీద ఉంది. అప్పుడు మోరిస్ 16.25 కోట్లకు అమ్ముడవగా.. ఇప్పుడు శామ్ కరన్ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శామ్ కరన్‌ కోసం ముంబై ఇండియ‌న్స్‌, బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ పోటీ పడి రేటు పెంచాయి. త‌ర్వాత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పోటీలోకి రావడంతో చివర్లో అనూహ్యంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా రేసులోకి రావడంతో రేటు 15 కోట్లు దాటిపోయింది. అటు ముంబై ఇండియన్స్ 18 కోట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధమైనా తీవ్రంగా ప్రయత్నించిన పంజాబ్ కింగ్స్‌ 18.50 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది. గత సీజన్‌లో శామ్ కరన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. శామ్ కరన్ తర్వాత ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ అత్యధిక ధర పలికాడు. అత‌డిని ముంబై ఇండియన్స్‌ ఏకంగా రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. గ్రీన్‌ను సొంతం చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ గట్టిగానే ప్రయత్నించినా.. చివరికి ముంబై జట్టు దక్కించుకుంది.  ఇక ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ కోసం కూడా ఫ్రాంచైజీలు తీవ్రంగా ప్రయత్నించాయి. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న స్టోక్స్ కోసం సన్‌రైజర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తీవ్రంగా ప్రయత్నించాయి. చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్‌కింగ్స్ రూ.16.25 కోట్లతో స్టోక్స్‌ను దక్కించుకుంది. అటు విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ కూడా మరోసారి భారీ ధర పలికాడు. 2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో వేలంలో అడుగుపెట్టిన పూరన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో పోటీ పడ్డాయి.చివరి లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ.16 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది.