KL Rahul: ఇంగ్లాండ్ టూర్ కు కే ఎల్ రాహుల్ దూరం

ఇంగ్లాండ్ టూర్ ఆరంభానికి ముందు టీమ్‌ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 07:40 PM IST

ఇంగ్లాండ్ టూర్ ఆరంభానికి ముందు టీమ్‌ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ వైస్ కెప్టెన్, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయంతో తప్పుకున్నాడు. నిజానికి సౌతాఫ్రికా తో సీరీస్ కోసం మొదట కేఎల్‌ రాహుల్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సరిగ్గా తొలి మ్యాచుకు ముందురోజు ప్రాక్టీస్‌లో అతడు గాయపడ్డాడు.

దీంతో ముందు జాగ్రత్తగా అతడిని సిరీస్‌ నుంచి తప్పించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌కు వెళ్లాడు. అయితే కోరుకున్నంత వేగంగా అతడు కోలుకోకపోవడంతో సీరీస్ నుంచి తప్పుకొక తప్పలేదు. కోహ్లీ, రోహిత్ లతో సహా పలువురు సీనియర్ ప్లేయర్స్ గురువారం లండన్ బయలుదేరారు. ఈ లోపే రాహుల్ కు ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహించి..ఒకవేళ పాసయితే అతన్ని కూడా పంపించాలని బీసీసీఐ భావించింది.

అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడమే మంచిదనీ వైద్యులు సూచించారు. అదే సమయంలో చికిత్స కోసం జర్మనీ పంపాలని ఎన్ సీ ఏ టీమ్ సూచించడంతో రాహుల్ ఇంగ్లాండ్ టూర్ నుంచీ వైదొలిగాడు.

కేఎల్‌ రాహుల్ గాయపడటం కొత్తేమీ కాదు. ఏడాది కాలంగా అతడు కొన్ని కీలకమైన సిరీసులకు దూరమయ్యాడు. 2021 నవంబర్లో తొడ కండరాలు పట్టేయడంతో న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ఆడలేదు. అదే ఏడాది ఫిబ్రవరిలో పిక్క కండరాల గాయంతో వెస్టిండీస్‌, శ్రీలంక టీ20 సిరీసుల నుంచి తప్పుకున్నాడు. మార్చిలో లంకపై టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. జనవరిలో మణికట్టు గాయంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసు నుంచి తప్పుకున్నాడు.

ఇపుడు జర్మనీలో చికిత్స పూర్తయిన తర్వాత రాహుల్ కొలుకుంటే ఇంగ్లాండ్ తో జరిగే వన్డే , టీ ట్వంటీ సీరీస్ లకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. రాహుల్ ప్రస్తుతం జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌కు మాత్రమే దూరమైయ్యాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్ట్‌ సిరీస్‌లోని చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు టీమిండియాలోని మెజార్టీ సభ్యులు ఇవాళ లండన్‌ విమానం ఎక్కారు.దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడుతున్న రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు సిరీస్‌ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు బయల్దేరతారు.మరోవైపు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత టీమ్‌ ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ జట్టుకు హార్ధిక్‌ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు.