RCB vs GT Today: గెలిస్తేనే నిలిచేది.. ఆర్సీబీకి డూ ఆర్ డై

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈరోజు మరో హోరాహోరీ పోరు జరగనుంది.

  • Written By:
  • Publish Date - May 19, 2022 / 09:45 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈరోజు మరో హోరాహోరీ పోరు జరగనుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తలపడనుంది. ఇప్పటికే ఈ సీజన్ ప్లే ఆఫ్ బెర్తు గుజరాత్ టైటాన్స్ కు ఈ మ్యాచ్‌ నామమాత్రమే కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం.. బెంగళూర్ ఇంటికే అని చెప్పొచ్చు. తాజా సీజన్‌లో ఇప్పటికే 13 మ్యాచ్‌లాడిన గుజరాత్ టైటాన్స్ టీమ్ 10 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 20 పాయింట్లు ఉండగా.. లీగ్ దశలో ఆ జట్టుకి ఇదే ఆఖరి మ్యాచ్మ కానుంది..

అలాగే ఇప్పటివరకు 13 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ జట్టు ఏడింటిలో మాత్రమే గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ టీమ్ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ని కచ్చితంగా ఓడించాలి. టాప్-4లో నిలవాలంటే.. గుజరాత్‌పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించాలి. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా తన చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో చిత్తుగా ఓడాలి.
అప్పుడే రాజస్థాన్‌ కంటే ఆర్సీబీ ముందుకెళ్తుంది. అలాగే వరుస పరాజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆర్‌సీబీకి మెరుగైన అవకాశాలుంటాయి.

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే.. నేటి మ్యాచ్‌లో రెండు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వృద్ధిమాన్ సాహా భీకరమైన ఫామ్‌లో ఉండగా బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్య , శుభమాన్ గిల్, వేడ్ .. అలాగే బౌలర్లలో మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, సాయి కిషొర్, రషీద్ ఖాన్ మెరుగ్గా రాణిస్తున్నారు. ఇక ఆర్సీబీ విషయానికొస్తే.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గ్లేన్ మాక్స్ వెల్ ఒక్కడే రెచ్చిపోయి ఆడాడు. అయితే ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఫామ్‌ అందుకుంటే మాత్రం గుజరాత్ టైటాన్స్ జట్టుకు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక బౌలింగ్ లో జోష్ హేజిల్ వుడ్ , హర్షల్ పటేల్,వానిందు హాసరంగా, మహ్మద్ సిరాజ్ కూడా రాణిస్తే.. బెంగళూరుని ఆపడం చాలా కష్టమవుతుంది.