Ishan Kishan: భారత జట్టులో పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇషాన్ కిషన్ (Ishan Kishan) చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఇషాన్ అంపైర్ వద్ద సహనం కోల్పోయాడు. అంపైర్ చేసిన బాల్ టాంపరింగ్ ఆరోపణలపై భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అసంతృప్తిగా కనిపించాడు. ఇది అంపైర్- ఇషాన్ మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.
అంపైర్‌తో ఇషాన్ గొడవపడ్డాడు
వాస్తవానికి, ‘ది ఏజ్’ వార్తల ప్రకారం.. భారత్-ఎ- ఆస్ట్రేలియా-ఎ మధ్య నాలుగో, చివరి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానంలోకి ప్రవేశించే ముందు అంపైర్ బంతి పరిస్థితిపై అసంతృప్తిగా కనిపించాడు. బంతిపై రకరకాల గీతలు పడడానికి భారత జట్టు ఆటగాళ్లే కారణమని ఆరోపించాడు. దీంతో రోజు ఆట కొత్త బంతితో ప్రారంభమవుతుందని అంపైర్లు నిర్ణయించారు.
Also Read: Ravindra Jadeja: టెస్టు క్రికెట్‌లో అరుదైన ఫీట్ సాధించిన రవీంద్ర జడేజా
అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇషాన్ కిషన్‌కు ఏమాత్రం నచ్చలేదు. దీనిపై అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్, ఇషాన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంపైర్ ఇషాన్‌తో.. “నువ్వు బంతిని స్క్రాచ్ చేసావు. మేము బంతిని మారుస్తాము. దీనిపై ఇప్పుడు చర్చ ఉండదు. ఆట మొదలు పెడదాం. ఇది చర్చించాల్సిన అంశం కాదు. మీరు ఈ బంతితో ఆడాలి” అని పేర్కొన్నాడు. దీనిపై ఇషాన్ స్పందిస్తూ “చాలా అసంబద్ధంగా ఉంది” అని అన్నాడు. భారత వికెట్ కీపర్ ఈ సమాధానం విన్న అంపైర్ తీవ్ర ఆగ్రహంతో ఇషాన్‌ను హెచ్చరించాడు. అంపైర్ స్పందిస్తూ.. నన్ను క్షమించండి. మీరు విభేదించినందుకు శిక్షించబడతారు. ఇది చాలా చెడ్డ ప్రవర్తన. మీ ప్రవర్తన కారణంగానే మేము బంతిని మార్చాలని నిర్ణయించుకున్నామని సమాధానం ఇచ్చాడు.
ఆస్ట్రేలియా A జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది
భారత జట్టు ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల్లో చిక్కుకుంటే వారిపై పెద్ద చర్యలు తీసుకోవచ్చు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళి ప్రకారం.. బాల్ టాంపరింగ్ వివాదంలో ఆటగాళ్లు చిక్కుకుంటే భారీ జరిమానాలు లేదా నిషేధాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాల్గవ రోజు ఆట కొత్త బంతితో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా A సులభంగా 86 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఇండియా Aని ఓడించింది.